ఆంధ్ర ప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు మే13వ తేదీన పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే జూన్4వ తేదీన పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ చేయనున్నారు. ఈ మేరకు జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ…కౌంటింగ్ నేపథ్యంలో తెనాలిలో అల్లరి మూకలు ఘర్షణలు సృష్టించే అవకాశం ఉందని తనకు సమాచారం ఉందని ఆయన తెలిపారు.
కౌంటింగ్‌లో ఇలాంటి వారి పట్ల ఎన్డీఏ కూటమి నేతలు జాగ్రత్తగా ఉండాలని నాదెండ్ల మనోహర్ సూచించారు. ప్రశాంతతకు నెలవు తెనాలి ప్రాంతమని, ఓట్ల లెక్కింపు రోజు ఘర్షణ వాతావరణానికి దూరంగా ఉందామని అన్నారు. ఘర్షణలు సృష్టించడానికి ఎవరూ ప్రయత్నించిన ప్రభుత్వ అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. తెనాలికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని నాదెండ్ల మనోహర్ అన్నారు.