ప్రధాని రాక నేపథ్యంలో భీమవరం (ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా) అందంగా ముస్తాబవుతోంది. ఈ నెల నాలుగున అల్లూరి 125వ జయంత్యుత్సవాల సందర్భంగా మోడీ ఇక్కడికి విచ్చేయనున్నారు. ఇక్కడ ఏఎస్ఆర్ పార్కులో ఏర్పాటుచేసిన 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అటుపై కాళ్ల మండలం, పెదఅమిరంలో జరిగే బహిరంగ సభలో ఆయన మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో మోడీ రాకకు సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ స్థానిక బీజేపీ నేతలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేస్తూ, సభకు ఎటువంటి ఆటంకాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడి వచ్చి, సంబంధిత వర్గాలతో మాట్లాడి వెళ్లారు.
ఢిల్లీ నుంచి ప్రత్యేక రక్షణ బృందాలు వచ్చి, సభా ప్రాంగణాన్ని తనిఖీ చేసి వెళ్లాయి. అదేవిధంగా సంబంధిత అధికారులు కొందరు ఇక్కడే ఉండి, అణువణువూ పరిశీలిస్తున్నా రు. అనుమానితులు ఎవరైనా ఎదురుపడితే ఆపి ఆరా తీస్తున్నారు. కలెక్టర్ పి.ప్రశాంతి, ఎస్పీ యు.రవిప్రకాశ్ నేతృత్వంలో ప్రాంగణాన్ని శుభ్రం చేయిస్తున్నారు. మోడీ సభ నేపథ్యంలో అటు టీడీపీ ఇటు వైసీపీ అప్రమత్తం అయ్యాయి. ఈ సభకు టీడీపీ ప్రతినిధులు తరలి రావాలని కోరుతూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చంద్రబాబుకు లేఖ రాశారు. ఆజాదీ కా అమృత్సోవాల్లో భాగం కావాలని, టీడీపీ తరఫున ప్రతినిధిని పంపాలని విన్నవిస్తూ లేఖ రాశారు. ఫోన్లోనూ సమాచారం అందించారు. వేడుకల్లో టీడీపీ తరఫున అచ్చెన్నాయుడు పాల్గొంటారని గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది టీడీపీ.