బలమయిన నాయకత్వంను పెంపొందించుకుంటే షర్మిల సేఫ్ లేదంటే ఆమె పార్టీ పెద్దగా ప్రభావం చూపకుండానే పెవిలియన్ బాట పట్టడం ఖాయం. కేసీఆర్ అనే రాజకీయ శక్తిని ఢీ కొనడం అనుకున్నంత సులువేం కాదు. ఆ మాటకు వస్తే ఆయన తిరుగులేని నేతగా ఎదిగిపోయాక మిగతా రాజకీయ పార్టీలు ఇంకా ఉనికి కోసమే పాకులాడుతున్నారు అన్నది వాస్తవం. తెలంగాణను తెచ్చిన పార్టీగా, ఇంటి పార్టీగా పేరున్న టీఆర్ఎస్-కు ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బందేం లేదు. కానీ పాలక వర్గాలు ఎప్పుడూ ఒకే విధంగా ఫలితాలు అందుకోవడం అన్నది అసాధ్యం.ఈ సందర్భంలో కేసీఆర్ ను నిలువరించే రాజకీయ శక్తి ఏది ఎక్కడ అన్నది తెలియడం లేదు.
ముఖ్యంగా తెలంగాణ వచ్చాక కేసీఆర్ కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. దళిత బంధులు వినూత్న పథకాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. వీటి కారణంగా గెలుపు సాధ్యం అని భావించిన కేసీఆర్ కు ఉప ఎన్నికల ఫలితాలు మాత్రం ఝలక్ ఇచ్చాయి. అయినా కూడా ఆయన పడి లేచిన కెరటం మాదిరిగా ఉన్నారు. ముందు కన్నా రెట్టించిన వేగంతో పనిచేస్తున్నారు. ఇదే కనుక ఇకపై కూడా కొనసాగితే విపక్షాలు ఈ సారి కూడా ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కోవడం తథ్యం అన్న వాదన వస్తోంది. అయితే తెలంగాణ వాకిట షర్మిల ప్రభావం ఎంత ?
రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల ఇక్కడ పార్టీ పెట్టారు. వైస్సార్టీపీ పేరిట తిరుగుతున్నారు. కానీ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయలేకపోయారు. అదేవిధంగా పాదయాత్రలు చేపట్టి ఆకట్టుకున్నా, అవి కూడా నామ మాత్ర ఫలితాలే ఇవ్వనున్నాయి. మరీ అంత గొప్ప స్థాయిలో అయితే ఆమె రాణించడం లేదు. ఈ నేపథ్యంలో షర్మిల ఇటీవల కొన్ని కామెంట్స్ చేశారు. కేసీఆర్‌ను మళ్లీ నమ్మి ఓటు వేస్తే భవిష్యత్ తరాలు క్షమించరని చెప్పారు. పాలకులు మంచి వాళ్లు ఐతే ప్రజలు చల్లగా ఉంటారన్నారు. ఈ వ్యాఖ్యలు తీరు ఎలా ఉన్నా కూడా ఆమె సంస్థాగతంగా స్థిరం అయ్యాకే, తెలంగాణ వాకిట రాజకీయంగా ఎదగగలరు అన్నది ఓ వాస్తవం.