కరోనా వైరస్ ప్రపంచాన్ని ఏ విధంగా వణికస్తుందో అందరికీ తెలిసిందే. దీంతో ప్రతి దేశంలోనూ దాదాపుగా లాక్ డౌన్ లాంటి పరిస్థితి ఏర్పడింది. జనాలు బయటకు రావడం లేదు. ఇక కొందరు కరోనాను అడ్డుకునేందుకు అనేక రకాల పద్ధతులను పాటిస్తున్నారు. మరికొందరు చిన్నపాటి దగ్గు, జలుబు, జ్వరం ఉన్నా.. పారాసిటమాల్ గోలీ వేసుకుంటే చాలులే అన్న ధోరణితో వ్యవహరిస్తున్నారు. పారాసిటమాల్ వేసుకుంటే కరోనా తగ్గుతుందని అనుకుంటున్నారు. అయితే అలాంటి వారిని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరిస్తోంది.
పారాసిటమాల్ గోలీ వేసుకుంటే సాధారణంగా ఒంటి నొప్పులు, దగ్గు, జలుబు, జ్వరం లాంటి తగ్గుతాయి. అయితే కరోనా లక్షణాలు ఉన్నవారు ఆ గోలీని వేసుకుంటే ఆ లక్షణాలు కనిపించకుండా ఉంటాయి. ఇది మరీ డేంజరని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. దాంతో కరోనా ఉందని నిర్దారించడం కష్టతరమవుతుందని ఆ సంస్థ హెచ్చరిస్తోంది. కనుక కరోనా లక్షణాలు ఉన్నాయని ఎవరైనా అనుమానిస్తే.. వెంటనే హాస్పిటల్‌కు వెళ్లాలిగానీ పారాసిటమాల్ గోలీలు వేసుకుని సొంత వైద్యం చేసుకోకూడదని, అది ప్రమాదమని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిస్తోంది.
ఇక కరోనా వైరస్ ఉన్నవారికి వైద్యులు పారాసిటమాల్ మాత్రమే కాకుండా, నొప్పులు, దగ్గు, జలుబును తగ్గించేందుకు పలు రకాల భిన్నమైన మందులు ఇస్తారని, అలాగే వైరస్ ప్రభావాన్ని తగ్గించేందుకు పలు యాంటీ వైరల్ ట్యాబ్లెట్లు ఇస్తారని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది. కానీ ఎవరూ కూడా ఆయా మెడిసిన్లను వేసుకుని సొంత వైద్యం చేసుకోకూడదని, అది ప్రాణాంతకమవుతుందని ఆ సంస్థ హెచ్చరిస్తోంది. ఆ మెడిసిన్లు వేసుకుంటే కరోనా ఉన్నదీ, లేనిదీ తెలుసుకోలేమని, కనుక మెడిసిన్లను సొంతంగా వాడకూడదని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.