కార్పొరేట్‌ రంగం వ్యవసాయం రంగంలోకి ప్రవేశిస్తే జరిగేది ఇదే

-

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన కొనసాగుతోంది. ఈ చట్టాలను అడ్డుపెట్టుకుని కార్పొరేట్‌ సంస్థలు వ్యవసాయంపై గుత్తాధిపత్యం సాధిస్తాయని, అప్పుడు తాము దోపిడికి గురవుతామన్నది రైతుల భయం.అయితే కార్పొరేట్‌ రంగం వ్యవసాయం రంగంలోకి ప్రవేశిస్తే ఏం జరుగుతుందనే జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది.

ప్రస్తుతం వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం ప్రధాన పాత్ర పోషిస్తోంది. వాస్తవానికి 23 రకాల వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం కొనాల్సి ఉన్నా ప్రస్తుతానికి వరి, గోధుములను మాత్రమే ఎక్కువగా కొంటోంది కేంద్ర ప్రభుత్వం. గోధుమలను కొనడంలో ప్రభుత్వం తర్వాత రెండోస్థానంలో ఉంది ఐటీసీ గ్రూప్. ఈ సంస్థ ఈ ఏడాది రైతుల నుంచి 2.2 మిలియన్‌ టన్నుల గోధుమలను కొనుగోలు చేసింది. మహీంద్రా గ్రూప్‌ కూడా వ్యవసాయ రంగంలో పెద్ద ఎత్తున వ్యాపారాలు ప్రారంభించింది. నెస్లే, గోద్రెజ్‌లాంటి బడా ప్రైవేట్‌ కంపెనీలు కూడా వ్యవసాయ రంగంలోకి వస్తున్నాయి.

రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడైనా మార్కెట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అయితే కొత్త వ్యవసాయ చట్టం కార్పొరేట్ గ్రూప్‌లైన అంబానీలు, అదానీలు వ్యవసాయరంగంలో ప్రవేశించడానికి అనుమతిస్తుంది. అందుకే రైతులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. తమ ఉత్పత్తులను కొనే బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పుకోరాదని రైతులు అంటున్నారు. అమెరికా తరువాత భారతదేశంలో అత్యధికంగా సాగు చేయగల భూమి ఉంది. కాని దిగుబడిలో మాత్రం భారతదేశం అమెరికాకంటే చాలా వెనకబడి ఉంది. సాంకేతిక పరిజ్ఞానం వాడకం తక్కువగా ఉండటం, వాతావరణ పరిస్థితులపై అవగాహన కల్పించే పరిజ్జానం రైతులకు అందుబాటులో లేకపోవడం ఒక కారణమైతే, ప్రభుత్వం అందించే మౌలిక సదుపాయాలు క్రమంగా తగ్గుతుండటం మరో కారణం.

ప్రజలకు ఆహార భద్రత కల్పించడం ప్రభుత్వ విధి. పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టం ద్వారా కరువుల, అంటువ్యాధుల సమయంలో ఉచితంగా ధాన్యం అందిస్తారు. కానీ ఈ పథకం పేరుతో సేకరిస్తున్న ధాన్యం అవసరమైన దానికన్నా ఎక్కువగా ఉంది. ఆహార భద్రత పేరుతో ఎక్కువగా ధాన్యాన్ని కొనడం రాజకీయ అనివార్యతగా మారింది. ప్రభుత్వం బియ్యం, గోధుమల కోసం చాలా డబ్బు ఖర్చు చేసింది. దానికి బదులు వల్ల ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేయడం మంచిదనే వాదన లేకపోలేదు. కనీస మద్దతు ధరను చట్టంలో చేర్చాలని, ప్రభుత్వం మండీల నుంచి కొనుగోళ్లను కొనసాగించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రస్తుత ఆందోళనల కారణంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.

గత రెండు దశాబ్దాలలో వ్యవసాయ రంగంలో చాలా మార్పులు జరిగాయి. అయితే ఈ మార్పులు ప్రభుత్వంకన్నా ప్రైవేటు శక్తుల వల్లనే ఎక్కువగా సాధ్యమయ్యాయి. టెక్నాలజీ, కొత్త విత్తనాలు, నాణ్యమైన ఎరువుల్లాంటి అంశాలు వ్యవసాయాభివృద్ధికి కారణం. ఇవే మార్పులు వ్యవసాయ రంగంలోని ప్రైవేట్ సంస్థలకు చోటు కల్పించాయి. కానీ ఏ వేగంతో మార్పులు జరుగుతున్నాయో, అందుకు అనుగుణంగా ప్రభుత్వాలు చట్టాలలో కూడా మార్పులు చేయాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వకాలంలో ఈ కొత్త చట్టంపై చర్చ జరిగింది. కానీ అది అమలు కాలేదు.ఇవి ప్రైవేట్‌ కంపెనీలు తమను దోచుకోకుండా తమ ఆదాయాన్ని పెంచే విధంగా ఉండాలని రైతులు కోరుతున్నారు. అయితే మోడీ సర్కారు.. ఈ మూడు చట్టాలను వాస్తవ పరిస్థితులకు అనుగుణంగానే తెచ్చామని చెబుతున్నా, తమను పరిగణనలోకి తీసుకోకుండా, హడావుడిగా ఆమోదించారని రైతులు ఆరోపిస్తున్నారు.

వ్యవసాయ రంగంలో ప్రైవేటు కంపెనీలు ఇప్పటికే ఉన్నాయని, అయితే అవి రైతులను దోచుకునేందుకు అవకాశాలు పెరిగాయని, రైతుకు రక్షణ లేదని రైతు సంఘాల నేతలంటున్నారు. రైతులకు మరిన్ని ఆప్షన్లు ఇస్తుంటే మమ్మల్ని రైతు అనుకూలురు అంటారా లేక వ్యతిరేకులు అంటారా? కొత్త వ్యవసాయ చట్టంతో రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే అవకాశం కల్పించామని బీజేపీ తన ట్వీట్‌లో గొప్పగా చెప్పుకుంది. కానీ ఈ చట్టంపై ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించి మరీ దీన్ని ఉపసంహరించుకోవాలని రైతు నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

వ్యవసాయదారుల ఆదాయం పెంపు పేరుతో మోడీ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారనేది ప్రధాన విమర్శ. కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులు సర్వస్వం కోల్పోతారనే ఆందోళన వ్యక్తమౌతోంది. 1992లో నూతన ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టినప్పుడే రైతుల కష్టాలు పెరిగిపోయాయి. 2000 తర్వాత రైతు ఆత్మహత్యల పరంపర నిరంతర ప్రక్రియగా మారింది. మెట్ట ప్రాంతాల రైతుల కష్టాలు ఒకరకంగా ఉంటే, ప్రాజెక్టుల కింద సాగునీటితో వ్యవసాయం చేసే రైతుల బాధలు మరోరకంగా ఉన్నాయి. అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టి, పంట చేతికి రాకపోతే రైతు రోదన భరించరానిది. నాటి ప్రభుత్వాలు రైతులకు ప్యాకేజీని ప్రకటించినా ఊరట లభించలేదు. గిట్టుబాటు ధర గురించి దేశవ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేయడంతో స్వామినాథన్‌ కమిషన్‌, రాంనారాయణరెడ్డి కమిషన్‌, జయతి ఘోష్‌ కమిషన్లు వేసి చేతులు దులిపేసుకున్నారే తప్ప ఆ కమిషన్లు ఇచ్చిన ఏ ఒక్క సిఫారసును అమలుచేయలేదు.

వ్యవసాయరంగంలో దళారుల వ్యవస్థ వేళ్లూనుకుంది. దీంతో రైతులు, వినియోగదారులు ఇద్దరూ నష్టపోతున్నారు. దళారుల సంపాదన మూడు పువ్వులు ఆరు కాయలు చందంగా పెరిగిపోతోంది. దీన్ని పరిష్కరించకుండా మోడీ ప్రభుత్వం వ్యవసాయ వృత్తికే ఎసరు పెడుతోంది. ఇప్పటికే దళారులున్నారు, మార్కెట్‌ వ్యవస్థ ఉన్నది. అయితే ప్రభుత్వం తరఫున మద్దతు ధర తప్పనిసరి. మోదీ ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాలతో స్థానిక దళారుల స్థానంలో కార్పొరేట్లు వచ్చి.. మద్దతు ధర కూడా లేకపోతే.. ఇక ఎవరికి లాభమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదంటున్నారు నిపుణులు.

స్వేచ్ఛ మార్కెట్‌ పేరుతో ఎఫ్‌సీఐ రద్దవుతుంది. వ్యవసాయ మార్కెట్లు మాయమైపోతాయి. రైతుకు పంటను అమ్ముకోవడానికి అనేక చిక్కులు ఎదురవుతాయి. నిత్యావసర వస్తువుల పంపిణీ వ్యవస్థను రద్దుచేయడం మూలంగా నిల్వలకు గతంలో ఉన్న ఆంక్షలుండవు. ఇష్టమైన రీతిలో నిల్వలు పెట్టుకొని, కృత్రిమ ఆహార కొరతను సృష్టించి వినియోగదారులను రెండు చేతులా దోచుకునే అవకాశం ఉంటుంది. ఈ కొత్త చట్టాలు కార్పొరేట్‌ కంపెనీల మేలు కోరి చేసినవే అంటున్నారు నిపుణులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version