దేశంలో కోవిడ్ రెండో వేవ్ తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కోవిడ్ బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో హాస్పిటళ్లలో మందులు, ఆక్సిజన్, ఇతర సదుపాయాలకు తీవ్రమైన కొరత ఏర్పడింది. కాగా దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ ఎప్పుడు అంతం అవుతుందనే విషయంపై ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా ఓ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
ప్రజలు సహకరించడంతోపాటు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే కోవిడ్ సెకండ్ వేవ్ బలహీనపడుతుందని డాక్టర్ గులేరియా చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో వైరస్ గరిష్ట స్థాయికి చేరుకుంటుందని, మహారాష్ట్రలో కేసులు తగ్గుతున్నాయని, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, పంజాబ్‌లలో పరిస్థితి స్థిరంగా ఉందని అన్నారు. మే మధ్యలో కేసులు తగ్గుతాయని భావిస్తున్నామని, అయితే ఈశాన్య రాష్ట్రాలు, బెంగాల్‌లలో కేసులు పెరుగుతాయని అన్నారు. ఈ క్రమంలో జూన్ నెల ఆరంభం వరకు కోవిడ్ సెకండ్ వేవ్ తగ్గేందుకు అవకాశం ఉందని అన్నారు.
ఇక కోవిడ్ -19 కేసుల తగ్గుదల ప్రజలపై ఆధారపడి ఉంటుందని డాక్టర్ గులేరియా తెలిపారు. ఈ క్రమంలోనే కోవిడ్ వ్యాప్తి చెయిన్‌ను విచ్ఛిన్నం చేయాలని, అందుకు అందరూ సహకరించాలని అన్నారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అవసరం అయితే తప్ప బయటకు రాకూడదని, విధిగా మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని అన్నారు.