ప్రజలు కష్టాల్లో ఉంటే. నాయకులు హోటళ్లలో సేదదీరుతున్న పరిస్థితి ఇప్పుడు గుంటూరులో కనిపిస్తోం దని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం కృష్ణానదికి వరద పోటెత్తడంతో ప్రకాశం బ్యారేజీకి సమీపంలోని అన్ని ప్రాంతాలు కూడా నీట మునిగాయి. ఈ నేపథ్యంలో గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వచ్చే రాజధాని ప్రాంతాలు కూడా నీట మునిగాయి. దీంతో ఇక్కడి ప్రజలు లబోదిబో మంటున్నారు. పూర్తిగా నీట మునిగిన ప్రాంతాల్లో ప్రభుత్వం తరఫున అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. అయితే, తాము ఓట్లు వేసి గెలిపించిన ఎంపీ ఎక్కడా అని ఇక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
కృష్ణా వరదలతో గుంటూరు జిల్లా లోని లోతట్టు ప్రాంతాలు సహా రాజధాని అమరావతికి సమీపంలోని ప్రాంతా లు కూడా నీట మునిగిపోయాయి. పొలాల పరిస్థితిని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ప్రభుత్వం తరఫున ఎన్ని సహాయక చర్యలు చేపట్టినా.. ప్రజాప్రతినిధులు ప్రత్యక్షంగా లేకపోతే.. ప్రజల సమస్యలపై అధికారులు చిన్నచూపు చూసే అవకాశం ఎక్కువ. పైగా తాము ఓట్లేసి గెలిపించిన నాయకుడు తమకు అవసరానికి అక్కరకు రాలేదనే బాధ ప్రజల్లోనూ ఉంటుంది. మొత్తంగా ఈ పరిస్థితిని ఇప్పుడు గుంటూరు ప్రజలు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల ఎన్నికల్లో గుంటూరు నుంచి పార్లమెంటుకు ఎంపీగా గెలిచిన గల్లా జయదేవ్ ఎక్కడ ని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రజల మధ్యే ఉంటాను, వారి కష్టాల్లో పాలు పంచుకుంటాను. అంటూ.. మాటలు చెప్పిన గల్లా ఇప్పుడు ఎక్కడ ఉన్నారని వారు ప్రశ్నిస్తున్నారు. కాగా, ఇటీవల వరకు పార్లమెంటు సమావేశాల్లో పాల్గొన్న గల్లా.. ప్రస్తుతం విదేశీ పర్యటనకు వెళ్లినట్టు తెలుస్తోంది. మొత్తానికి సరైన సమయంలో ఆయన లేకపోవడం, తమ కష్టాలు తీర్చకపోవడంతో ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.