లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.మరోసారి బీజేపీ, కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.ఆదివారం కరీంనగర్‌లో కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…బీజేపీ నేతలు దేవుడైనా రాముడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి లబ్ధి పొందేలా ప్లాన్ చేస్తున్నారని మండిపడ్డారు .ప్రతిదానికి రాముడిని తెరమీదకు తీసుకువస్తున్నారని, రాముడు ఏమైనా బీజేపీ ఎంపీనా, లేక బీజేపీ ఎమ్మెల్యేనా అని సూటిగా బీజేపీ నేతలను కేటీఆర్ ప్రశ్నించారు.
రాముడు అందరికీ దేవుడేనని కేటీఆర్ అన్నారు. రాముడిని దేశానికి బీజేపీనే పరిచయం చేసినట్టుగా ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీ లేకపోతే బొట్టే పెట్టుకోలేము అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. బీజేపీ ఉన్నా దేవుడు ఉంటాడని.. బీజేపీ లేకపోయిన దేవుడు ఉంటాడని అన్నారు.. బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్‌ని గెలిపించాలని అభ్యర్థించారు. కరీంనగర్‌లో బండి సంజయ్‌తో రేవంత్ కుమ్మక్కయ్యారని కేటీఆర్ ఆరోపించారు. డమ్మీ క్యాండిడేట్‌ను పెట్టి సంజయ్‌ను మరోసారి ఎంపీగా గెలిపించాలని చూస్తున్నారని మండిపడ్డారు.