కొత్త తరం నేతలకు ప్రోత్సాహం అందించాలన్న సంకల్పంలో భాగంగా ఒడిశా ప్రాంతానికి చెందిన గిరిజన మహిళ ద్రౌపదీ ముర్మూను ఎంపిక చేశామని బీజేపీ అగ్ర నాయకత్వం చెబుతోంది. ఇప్పటికే రాష్ట్రపతిగా పనిచేసిన ప్రణభ్ ముఖర్జీ కూడా తూర్పు ప్రాంతానికి చెందిన వారే ! ఆయన స్వస్థలం : పశ్చిమ బెంగాల్. మరోసారి ఇదే ప్రాంతానికి ప్రాధాన్యం ఇచ్చి అందరినీ మళ్లీ మళ్లీ ఆశ్చర్యపరిచింది. వాస్తవానికి రాష్ట్రపతి పదవికి దళిత, గిరిజన , మైనార్టీ వర్గాలకు చెందిన మహిళల్లో ఎవరో ఒకరిని ఎంపిక చేయాలని భావించారు. ఇందుకు సంబంధించి పలు పేర్లు పరిశీలించారు. జాబితాలో ఛత్తీస్ గఢ్ గవర్నర్ అనసూయ ఉయికీ పేరు కూడా వినిపించింది. ఆఖరికి అదృష్టం మాత్రం ద్రౌపదీ ముర్మూనే వరించింది. ఆమె ఎంపికపై ఎన్డీఏ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఆమె ఎంపిక తమకు సమ్మతమే అని చెబుతున్నాయి.
ఇదే ఆమె నేపథ్యం :
1994 నుంచి 97 వరకూ ఉద్యోగ విధులు నిర్వర్తించాక, 1997లో బీజేపీలో చేరారు. రాయ్ రంగ్ పూర్ మున్సిపల్ కౌన్సిలర్ గా, అదే పాలక మండలికి వైస్ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. 2000లో రాయ్ రంగ్ పూర్ ఎమ్మెల్యేగా, అటుపై బిజు జనతాదళ్ పార్టీ, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కారులో రవాణా, వాణిజ్య శాఖ మంత్రిగా పదవి చేపట్టారు. 2000 నుంచి రెండేళ్ల పాటు ఈ పదవిలో ఉన్నాక, 2002 నుంచి 2004 వరకూ పశు సంవర్థక శాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో మళ్లీ రాయ్ రంగ్ పూర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2002 నుంచి 2009 వరకూ మయూర్ భంజ్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేశారు. 2006 నుంచి 2009 వరకూ ఒడిశా రాష్ట్ర ఎస్టీ మోర్చా అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించారు. 2010లో మయూర్ భంజ్ జిల్లా అధ్యక్ష పదవి అందుకున్నారు. అటుపై 2013 నుంచి 2015 వరకు మయూర్ భంజ్ బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేశాక, 2015లో ఝార్ఖండ్ గవర్నర్ గా నియమితులయ్యారు.