లేటుగా వస్తే ఒప్పుకోం సమావేశాలకు సంబంధించి కాంగ్రెస్ అధినాయకత్వం ఇస్తున్న వార్నింగ్.. టైం అంటే ఏమనుకున్నరు అని మండిపడుతోంది. మీరు గెలవకున్నా పర్లేదు కానీ పార్టీని మాత్రం చెడగొట్టకండి అని కూడా అంటోంది పై స్థాయి నయా నాయకత్వం. ఈ నేపథ్యంలో యువ రాజు రాహుల్ వస్తే ఎలా ఉంటుంది అని ఓ ప్రతిపాదన ఏఐసీసీకి వెళ్లింది అని ప్రధాన మీడియా వర్గాలు చెబుతున్నాయి.
ఇందుకు అంగీకారం తెలిపిన యువ రాజు తన నేతృత్వాన తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను గాడిలో పెట్టేందుకు మే ఆరు, ఏడు తేదీలలో పర్యటించేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ ఇందుకు తగ్గ షెడ్యూల్ ఇచ్చారు. మే ఆరున ఐదు లక్షల మంది ప్రజలతో వరంగల్ కేంద్రంగా భారీ బహిరంగ సభకు సిద్ధం అవుతోంది టీపీసీసీ. ఈ సభకు రాహుల్ వచ్చి కీలకోపన్యాసం ఇవ్వనున్నారు. అటుపై అసంతృప్తులతో మాట్లాడనున్నారు అని కూడా తెలుస్తోంది. కనుక యువ రాజు వచ్చే టైం లో లుకలుకలు సర్దుకుంటాయా? అన్నది ఓ పెద్ద సందేహాస్పదం.
తెలంగాణలో కాంగ్రెస్ వ్యవహారాలను చక్కదిద్దే పనిని టీపీసీసీ బాస్ చేపట్టాల్సి ఉంది. కానీ ఆయన అనుకున్నంతగా రాణించడం లేదు అన్న విమర్శ ఒకటి ఎప్పటి నుంచో ఉంది. ఈ విమర్శను జగ్గారెడ్డి కూడా గతంలో చేశారు. తాము కాంగ్రెస్ భక్తులం అని అయితే రేవంత్ రెడ్డి తో ఉన్న విభేదాల కారణంగానే కాస్త వెనకబడిపోతున్నామని ఇంకొందరు జగ్గారెడ్డి కోవకు చెందిన వారే వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు మధు యాసకీ లాంటి పెద్దలు కూడా అనుకున్నంతగా పార్టీ ఎదుగుదలకు క్షేత్ర స్థాయిలో కృషి చేయలేకపోతున్నారు. ఇదే సందర్భంలో రేవంత్ రెడ్డి కూడా సీనియర్లను కలుపుకుని పోలేకపోతున్నారు అన్న వాదన కూడా ఉంది. ఎవరి వాదన ఎలా ఉన్నా తెలంగాణలో కాంగ్రెస్ కోలుకునేందుకు కావాల్సిన జవం మరియు జీవం నింపాల్సింది అధినాయకత్వమే అన్నది కాదనలేని వాస్తవం.
ఈ తరుణంలో పార్టీ నుంచి వేరు పడి కొత్త సమీకరణాలకు రూపం ఇచ్చేందుకు కూడా కొందరు ప్రయత్నాలు చేసినా కూడా ఏఐసీసీ స్థాయిలో వాటికి ఒకప్పుడు అడ్డు కట్ట పడేది. కానీ ఇప్పుడు ఆ విధంగా కూడా కొన్ని సార్లు జరగడం లేదన్న అభిప్రాయం ఒకటి లీడర్ల నుంచి మరియు ఇదే సమయాన వివిధ స్థాయిలో పనిచేసిన లేదా పని చేస్తున్న క్యాడర్ల నుంచి కూడా వస్తోంది. కనుక లీడర్ కు క్యాడర్ మధ్య గ్యాప్ వచ్చింది అని కొందరు లేదు తీసుకున్నారు అని కొందరు సినిమా డైలాగులను చెబుతున్నారే కానీ పార్టీ మరమ్మతులకు పాటు పడడం లేదు. పార్టీకి చేయాల్సినంత చేయడం లేదు.
డిజిటల్ వింగ్ అయితే బలోపేతం అయినా కూడా విమర్శాస్త్రాలు క్షేత్ర స్థాయిలో సంధించినప్పుడే వాటికో విలువ ఉంటుందనరి ఇందుకు తగ్గ విధంగా అధ్యయనం కూడా ఉండాలని అంటోంది అధినాయకత్వం. తెలంగాణ రాష్ట్ర సమితి ని ఢీ కొనడం సులువు కాకపోయినా చెప్పుకోదగ్గ మద్దతుతో చెప్పుకోదగ్గ స్థాయిలో పోరాటం మాత్రం చేయాల్సిందేనని కేంద్ర నాయకత్వం అయిన ఠాగూర్ లాంటి వ్యక్తులు చెబుతున్నారు. కనుక ఇప్పుడు టైం ఎవరిది? టైమింగ్ ఎవరిది? అన్నది ప్రధాన చర్చ.