చలికాలం ప్రారంభమై, వీధులన్నీ ముగ్గులతో కళకళలాడుతున్నాయంటే ధనుర్మాసం వచ్చేసినట్లే. అయితే ఈ నెలలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక సందడి కనిపిస్తుంది కానీ పెళ్లి భాజాలు మాత్రం వినిపించవు. “శుభకార్యాలకు ఈ నెల మంచిది కాదా?” అని చాలామందికి సందేహం కలుగుతుంటుంది. అసలు ధనుర్మాసంలో పెళ్లిళ్లు ఎందుకు చేయరు? దీని వెనుక ఉన్న శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలేంటి? మన సంస్కృతిలో ఈ నెలకు ఉన్న విశిష్టత ఏమిటో తెలుసుకుందాం..
హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశించిన కాలాన్ని ధనుర్మాసంగా పిలుస్తారు. ఈ సమయంలో సూర్యుడు ‘శూన్య రాశి’లో ఉంటాడని, అందుకే దీనిని ‘శూన్య మాసం’ అని కూడా అంటారు. ఆధ్యాత్మికంగా ఇది కేవలం దైవారాధనకు మాత్రమే కేటాయించబడిన సమయం.
ఈ నెలలో లౌకికపరమైన సుఖాల కంటే, పరమాత్మ చింతనకు ప్రాధాన్యత ఇస్తారు. గోదాదేవి శ్రీరంగనాథుడిని కొలిచిన ఈ పవిత్ర మాసంలో మన ఏకాగ్రత మొత్తం భక్తిపైనే ఉండాలని పెద్దలు భావించారు. అందుకే పెళ్లిళ్లు, గృహప్రవేశాల వంటి వేడుకల హడావిడిలో పడి దైవప్రార్థనను మర్చిపోకూడదనే ఉద్దేశంతో ఈ మాసంలో శుభకార్యాలను పక్కన పెడతారు.

శాస్త్రీయంగా చూస్తే, ఈ సమయంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. పాత కాలంలో రవాణా సౌకర్యాలు లేని రోజుల్లో, ఈ చలిలో దూరప్రయాణాలు చేసి శుభకార్యాలకు హాజరుకావడం కష్టంగా ఉండేది. అలాగే, రైతులు ఈ సమయంలో పంట కోత పనుల్లో నిమగ్నమై ఉండేవారు. ఆధ్యాత్మిక క్రతువుల ద్వారా మనోబలాన్ని పెంచుకోవడానికి ఇది ఒక మంచి విరామం లాంటిది.
ధనుర్మాసం ముగిసి సంక్రాంతి తర్వాత సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించగానే ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. అప్పుడు మళ్ళీ శుభ ముహూర్తాల సందడి మొదలవుతుంది. కాబట్టి ఈ నెలను దైవ స్మరణకు, మనశ్శాంతికి వేదికగా మార్చుకోవడం ఎంతో శ్రేయస్కరం.
గమనిక: ధనుర్మాసంలో పెళ్లిళ్లు చేయకపోవడం అనేది ఒక ఆచారం మరియు ఆధ్యాత్మిక నమ్మకం. ప్రాంతీయ ఆచారాలు, సంప్రదాయాలను బట్టి కొన్ని మినహాయింపులు ఉండవచ్చు. మరింత ఖచ్చితమైన వివరాల కోసం మీ కుటుంబ పురోహితులను సంప్రదించడం మంచిది.
