అడిలైడ్‌లో ఓటమి అనంతరం భారత క్రికెట్ జట్టు మెల్‌బోర్న్‌లో గెలిచి టెస్టు సిరీస్‌ను 1-1 తో సమం చేసింది. తరువాత సిడ్నీలో ఇటీవల జరిగిన టెస్టు మ్యాచ్‌లో జట్టు ప్లేయర్లు కొందరు గాయాలతో బాధపడుతున్నప్పటికీ టీమిండియా మ్యాచ్‌ను డ్రాగా ముగించగలిగింది. ఈ క్రమంలోనే శుక్రవారం నుంచి బ్రిస్బేన్‌లో చివరిదైన నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది. దీంతో ఇరు జట్లు ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని చూస్తున్నాయి.
ఇక గాయాల వల్ల బ్రిస్బేన్ టెస్టు మ్యాచ్‌లో రవీంద్ర జడేజా, హనుమ విహారి, జస్‌ప్రిత్ బుమ్రాలు ఆడడం లేదు. దీంతో తుది జట్టులో ఎవరు ఉంటారనేది ఇప్పుడు సందేహంగా మారింది. అయితే మ్యాచ్‌కు ఒక్క రోజు మాత్రమే ఉన్న నేపథ్యంలో టీం మేనేజ్‌మెంట్ జట్టును ఏ క్షణంలో అయినా ప్రకటించేందుకు అవకాశం ఉంది. ఇక బ్రిస్బేన్ లో మ్యాచ్ జరిగే మైదానాన్ని ది గబ్బా అని పిలుస్తారు. అలాగే టెస్టును కూడా ది గబ్బా టెస్ట్ అని అంటారు. దీనికి కారణం ఏమిటంటే…
బ్రిస్బేన్ లో ది గబ్బా మైదానం ఉన్న ప్రాంతాన్ని వూలూన్‌గబ్బా అని పిలుస్తారు. దీనికి షార్ట్ రూపమే గబ్బా. అందుకనే ఈ మైదానాన్ని ది గబ్బా అని, ఇందులో టెస్టు మ్యాచ్‌లు జరిగితే వాటిని గబ్బా టెస్ట్‌లు అని పిలుస్తారు. ఇక శుక్రవారం నుంచి జరగనున్న మ్యాచ్‌లో భారత జట్టులో ప్లేయర్లు ఎవరెవరు ఉంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పూర్తి స్థాయి జట్టు ఉంటేనే ఆసీస్ మీద గెలవడం కష్టంగా ఉంటుంది. అలాంటిది ఇప్పుడు జట్టులో కీలక ప్లేయర్లు లేదు. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్ ఎలాంటి ప్రదర్శనను ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.