నిత్యం వరస వివాదాల్లో చిక్కుకుంటున్నారు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ. హఫీజ్ పేట భూవివాదంలో అఖిల దంపతులపై కేసు నమోదు కావడం సంచలనం సృష్టించింది. అయిన ఆమె వ్యవహారంలో టీడీపీ నుంచి స్పందన రాలేదు. టీడీపీ ముఖ్య నేతలపై ఎక్కడ కేసులు నమోదైనా, దాడులు చేసినా వెంటనే స్పందించే ఆ పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మూడు రోజులుగా స్పందిచకపోవడంతో పట్ల అఖిలప్రియ రాజకీయంగా ఒంటరయ్యారా అన్న చర్చ ఇప్పుడు సొంత పార్టీలోనే జరుగుతోంది.
ప్రభుత్వంపై విమర్శలైనా.. పార్టీ నేతలపై జరిగే దాడులపై నైనా.. లోకేష్ వెంటనే రియాక్ట్ అవుతారు. ట్వీట్ చేస్తారు. మొన్న ప్రొద్దుటూరులో ఓ సాధారణ కార్యకర్తను హత్య చేస్తే మర్నాడే అక్కడకు వెళ్లారు. ధర్నా చేశారు. అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఆ తర్వాత రెండు రోజులకే గుంటూరు జిల్లా పల్నాడులో టీడీపీ నేత హత్య జరిగింది. అక్కడకూ హుటాహుటిన వెళ్లారు లోకేష్. తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీ కేసుల వ్యవహారంపై అటు చంద్రబాబు ఇటు లోకేష్ ఘాటుగానే స్పందించారు. కానీ అఖిలప్రియ విషయంలో సైలెంట్ అయ్యారు. అఖిల దంపతులపై కేసు నమోదు, ఆరోపణలపై ఇప్పటి వరకు స్పందించలేదు. పార్టీ అధినేతలు మాత్రమే కాదు.. ఆమె సహచర మాజీ మంత్రులు, జిల్లా నేతలు సైతం మౌనంగానే ఉన్నారు.
భూమా అఖిల సోదరి మౌనిక, సోదరుడు విఖ్యాతరెడ్డి బయటే ఉన్నారు. వారిని కూడా పార్టీ నేతలు పరామర్శించి వాస్తవలేంటో కనుక్కునే ప్రయత్నం చేయలేదు. ఇటీవల కాలంలో అఖిల దంపతులు తరచూ వివాదాల్లో చిక్కుకోవడం టీడీపీలో చర్చ జరుగుతోందట. టీడీపీలోనే ఉన్న ఏవి సుబ్బారెడ్డిపై హత్యకు కుట్ర కేసు విషయంలోనూ పార్టీ నేతలు స్పందించలేదు. భూమా నాగిరెడ్డి చనిపోయాక అఖిల, ఏవి సుబ్బారెడ్డి మధ్య తలెత్తిన విబేధాలపై కొందరు నాయకులు జోక్యం చేసుకున్నారు. చంద్రబాబు వద్ద కూడా ఏవి సుబ్బారెడ్డి పంచాయితీ పెట్టారు. అయితే వివాదం సమసిపోలేదు సరికదా మరింత ముదిరింది.
ఆళ్లగడ్డలో కంకర ఫ్యాక్టరీ వివాదం, విజయ మిల్క్ డెయిరీ చైర్మన్ పదవి వివాదం..తాజాగా హఫీజ్‌పేట భూ వివాదం. ఇవి సంచలనంగా మారుతున్నా అఖిల విషయంలో పార్టీ పెద్దగా జోక్యం చేసుకున్న దాఖలాలు లేవు. ఈ వివాదాలను అఖిల సొంత వ్యవహారాలుగా టీడీపీ భావిస్తోందా అనే చర్చ జరుగుతోంది. మరోవైపు ఆమె భర్త భార్గవ్ మితిమీరిన జోక్యం భూమా కుటుంబానికి, పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉన్నాయన్న చర్చ మొదలైంది. అందుకే పార్టీ నేతలెవరూ జోక్యం చెసుకోకపోవడంతో భూమా అఖిల ఒంటరయ్యారా అని అంతా చెవులు కొరుక్కుంటున్నారు.