ఏసుక్రీస్తు క్రైస్తవులకు ఆరాధ్య దైవం. ప్రపంచానికి ఆయన చక్కని బోధనలు చేశారు. తోటివారిని ప్రేమించమన్నారు. శత్రువులనైనా సరే క్షమించమన్నారు. ప్రజలు చేసిన పాపాల నుంచి వారిని రక్షిస్తానన్నారు. ఆయన తన జీవితంలో కలలో కూడా ఎవరికీ ఏ అపకారమూ చేయలేదు. అయినప్పటికీ ఆయనకు మరణ దండన విధించి శిలువ వేశారు. ఇంతకీ అసలు ఏసుక్రీస్తును ఎందుకు శిలువ వేశారు ? అంత మంచి వ్యక్తిని చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది ? ఆయన ఏ నేరం చేయకుండానే అకారణంగా ఆయనకు మరణ దండన ఎందుకు విధించారు ? అంటే…
ఏసుక్రీస్తు ఎప్పుడూ ఆపదలో ఉన్నవారిని రక్షించాడే తప్ప ఎవరికీ హాని చేయలేదు. తోటి వారిపై కరుణ చూపించమన్నాడు. ఇతరులను ప్రేమించమన్నాడు. అలాంటి ఎన్నో మంచి బోధనలు చేశాడు. అలాగే ఆకలితో ఉన్న పేదలకు ఆహారం పెట్టాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని రక్షించాడు. దీంతో సహజంగానే ప్రజలకు ఏసుక్రీస్తుపై నమ్మకం కుదిరింది. పెద్ద ఎత్తున ఆయనను అనుసరించడం మొదలు పెట్టారు. అయితే రోమన్ పాలనలో ఉన్న మతాధిపతులు ఏసు క్రీస్తుకు లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకపోయారు. ఆయనపై దుష్ర్పచారం మొదలు పెట్టారు. ఈ క్రమంలో చివరకు ఏసుక్రీస్తుకు మరణ దండన విధించాలన్న ఆదేశాలు తెచ్చుకున్నారు.
అయితే ఏసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు, ఆయన్ను ఎలా కనిపెట్టాలి అనే విషయాలు తెలుసుకునేందుకు క్రీస్తు శిష్యుల్లో 13వ వాడైన జూడాస్‌కు రోమన్ మతాధిపతులు 33 వెండి నాణేలను లంచంగా ఇచ్చారు. దీంతో జూడాస్ క్రీస్తు జాడను చెప్పడంతోపాటు విందులో ఉన్న ఆయన్ను రోమన్ సైనికులకు చూపిస్తాడు. దీంతో రోమన్ సైనికులు క్రీస్తును తమ ఆధీనంలోకి తీసుకుని ఆ తరువాత క్రీస్తుకు శిలువ వేస్తారు. క్రీస్తు తన జీవిత కాలంలో ప్రజలకు ఉపయోగపడే బోధనలు చేస్తూ వారిని కాపాడాడే కానీ ఎవరికీ ఏ హానీ తలపెట్టలేదు. కానీ కొందరు చేసిన కుట్రలు, దుష్ప్రచారాల వల్ల ఆయన తన ప్రాణాలనే కోల్పోయాడు..!