రాజకీయ నాయకులు ప్రజలకు అది చేస్తాం, ఇది చేస్తాం అని ఎన్నికలకు ముందు వాగ్దానాలు ఇవ్వడం షరా మామూలే. ఎన్నికలు పూర్తయి ఫలితాలు వెలువడి కొత్త ప్రభుత్వం కొలువుదీరాక.. వాగ్దానాల సంగతిని వారు మరిచిపోతారు. అబ్బే మేమలా అనలేదని బుకాయిస్తారు. ఇది వారికి మామూలే. ఇక ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ విషయంలోనూ కేంద్రం ఇలాగే వ్యవహరిస్తుందా ? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది.
ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో బీజేపీ ప్రజలకు ఉచిత వాగ్దానాలను ఇచ్చింది. అందులో ఉచిత కరోనా వ్యాక్సిన్ కూడా ఒకటి. అదేమిటి ? దేశంలోని అందరికీ వ్యాక్సిన్ ను ఉచితంగా ఇవ్వాల్సిందే కదా, కేవలం బీహార్‌కే ఉచితంగా ఇస్తామంటున్నారేమిటి ? అని విమర్శలు వచ్చే సరికి బీజేపీ వెనక్కి తగ్గింది. దేశంలోని అందరికీ కోవిడ్ వ్యాక్సిన్ ను ఉచితంగా అందజేస్తామని సాక్షాత్తూ కేంద్ర మంత్రి ప్రతాప్ సారంగి స్పష్టం చేశారు. ఇక ప్రధాని మోదీ కూడా పలుమార్లు ఇదే విషయంపై మాట్లాడారు. దేశంలోని ప్రతి మూలలో ఉన్న పౌరుడికి వ్యాక్సిన్‌ను అందిస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు కేంద్రం మాట మార్చినట్లు కనిపిస్తోంది.
కరోనా వ్యాక్సిన్‌ను కేంద్రం మరో 2, 3 వారాల్లో ప్రజా పంపిణీకి సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే మోదీ ఇప్పటికే రాష్ట్రాలతో చర్చించారు. ముందుగా వ్యాక్సిన్‌ను ఎవరికి ఇవ్వాలో ఒక జాబితా సిద్ధం చేసుకోండి అంటూ రాష్ట్రాలకు చెప్పారు. రాష్ట్రాలు కూడా అదే పనిలో పడ్డాయి. అయితే వ్యాక్సిన్ ధర ఎంత నిర్ణయించాలనే దానిపై కేంద్రం ఇప్పుడు సమాలోచనలు చేస్తోంది. కానీ వ్యాక్సిన్‌ను ఉచితంగా ఇస్తామనే మాటను మరిచిపోయారు. దీంతో ప్రతిపక్షాలు ఇదే విషయాన్ని గుర్తు చేస్తున్నాయి.
వ్యాక్సిన్‌ను దేశంలోని అందరికీ ఉచితంగా ఇస్తామన్నారు కదా, మళ్లీ ధరలపై చర్చలెందుకు చేస్తున్నారని ప్రతిపక్షాలు కేంద్రాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాయి. అయితే ప్రజలకు వ్యాక్సిన్‌ను ఉచితంగా ఇవ్వాలనే అంశం రాష్ట్రాల పరిధిలో ఉందని, ఆ నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేస్తున్నామని కేంద్రం చెప్పకనే చెప్పింది. దీంతో ఉచిత వ్యాక్సిన్ హామీ అటకెక్కినట్లే అనిపిస్తోంది. మరి దీనిపై కేంద్రం చివరకు ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఉచితం కాకుండా ఏ ధరకు వ్యాక్సిన్‌ను అమ్మినా పేదలకు ఆ వ్యాక్సిన్ అందదని నిరభ్యంతరంగా చెప్పవచ్చు..!