40 ఏళ్లు దాగిన భర్త నిజం – భార్య షాక్‌…!

-

‘మీ పేరు.?’… అడిగాడతను. ఈయన చెప్పాడు. ‘మీ అసలు పేరు.?’ అన్నాడాయన కొంచెం కఠినంగా. అప్పుడు గొణిగాడతను తన అసలు పేరును. ఇదంతా బిత్తరపోయి చూస్తున్న భార్యకు ఒక్కసారిగా షాక్‌….


అది న్యూయార్క్‌.. 2015వ సంవత్సరంలో ఓ రోజు….

బాబీ లవ్‌, షెరిల్‌ లవ్‌ల ఇంటి డోర్‌బెల్‌ మోగింది. తలుపు తీసిన షెరిల్‌ను దాదాపు నెట్టుకుంటూ లోపలికి వచ్చేసారు ఇద్దరు పోలీసులు. సరాసరి బాబీ దగ్గరికి వెళ్లి, ‘నీ పేరు?’ ప్రశ్నించారు. పేరు చెప్పాడు బాబీ. ‘అది కాదు.. అసలు పేరు?’ గట్టిగా అడిగాడా పోలీసాఫీసర్‌. బాబీ ఏదో గొణిగాడు. ‘చాలా కాలమయింది కదూ.!.. పద’ కఠినంగా అంటూ రెక్క పట్టుకుని లాక్కెళ్లాడు పోలీసాయన.

మెదడు మొద్దుబారిపోయినట్లు చూస్తోంది షెరిల్‌ జరుగుతున్న తతంగాన్నంతా. 69ఏళ్ల బాబీని పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్తున్నారు. 30ఏళ్ల క్రితం వారిద్దరూ లవ్‌ మ్యారేజి చేసుకున్నారు. నలుగురు పిల్లలు. ఇప్పుడు వారంతా చాలా పెద్దవారు కూడా. ఏంటో అర్థం కాని షెరిల్‌కు పోలీస్‌ఆఫీసర్‌ ఒక భయంకరమైన నిజాన్ని చెప్పాడు. ‘‘నీ భర్త ఓ పారిపోయిన ఖైదీ’’.

బాబీ-షెరిల్‌ల గాథను ప్రముఖ ఫేస్‌బుక్‌ పేజీ ‘ హ్యుమన్స్‌ ఆఫ్‌ న్యూయార్క్‌’, పదకొండు వరుస పోస్టుల ద్వారా ప్రపంచానికి చేరవేసింది. విచ్చలవిడిగా షేరింగ్‌లు, లైకులతో ఫేస్‌బుక్‌ తడిచిముద్దయింది. వారి ప్రణయగాథ ప్రస్తుతం వేనోళ్ల నానుతోంది.

అసలు కథేంటంటే….

బాబీ లవ్‌… సారీ సారీ.. వాల్టర్‌ మిల్లర్‌, నార్త్‌ కరోలినాలో తన ఒంటరి తల్లి, ఏడుగురు తోబుట్టువులతో దుర్భర దారిద్య్రాని గడుపుతుండేవాడు. తోటి స్నేహితులు దొంగతనాలు చేస్తూ, మిల్లర్‌ను కూడా ప్రోత్సహించారు. వారి చెడు సావాసంతో మిల్లర్‌ కూడా దొంగతనాల్లో ఆరితేరాడు. చిన్నచిన్న దొంగతనాల నుంచి బ్యాంకు దోపిడిల దాకా ఎదిగాడు. ఒకరోజు ఓ బ్యాంకు దొంగతనం చేస్తుండగా, మేనేజర్‌ సైలెంట్‌ ఆలారం నొక్కడంతోవచ్చిన పోలీసులకు మిల్లర్‌ పట్టుబడ్డాడు. అప్పటికే చాలా కేసులుండటంతో వాల్టర్‌ మిల్లర్‌కు 25 నుంచి 30 ఏళ్ల జైలుశిక్ష విధించాడు న్యాయమూర్తి.

బాబీజైళ్లో బుద్ధిగా ఉండటంతో మిల్లర్‌ను తక్కువ భద్రత కలిగిన జైలుకు తరలించారు. అక్కడ మిల్లర్‌ జైలు రేడియో స్టేషన్‌లో పనిచేసేవాడు. అందుకని ఓ జత మామూలు బట్టలు కూడా ఇచ్చారు. అక్కడి భద్రతను బాగా పరిశీలించిన మిల్లర్‌, తప్పించుకోవాలని ప్లాన్‌ వేసాడు. ప్రతి మంగళవారం, అక్కడి రోడ్లు శుభ్రం చేయడానికి ఖైదీలను తీసుకెళ్తారు. అది అదనుగా తీసుకున్న మిల్లర్‌, ముందురోజు రాత్రి, మామూలు బట్టలమీదే జైలు యూనిఫారం వేసుకుని రెడీగా ఉన్నాడు. తెల్లవారి బయటకు వెళ్లగానే , రోడ్లు ఊడుస్తున్నట్లు నటించి, జైళు యూనిఫారం తీసేసి, అందరిముందే దర్జాగా పారిపోయాడు. ఇది జరిగింది 1977లో.

నేరుగా న్యూయార్క్‌ చేరుకున్న మిల్లర్‌ తన పేరును బాబీ లవ్‌గా మార్చుకుని, అక్కడాఇక్కడా పనిచేసుకుంటూ బతుకుతున్నాడు. 1985లో కలిసిన షెరిల్‌తో ప్రేమలో పడ్డ బాబీ, పెళ్లి చేసుకుని నలుగురు పిల్లల్ని కన్నాడు. వారు చదువుకున్నారు. పెద్దవారయ్యారు. పెళ్లిళ్లయ్యాయి.. 30ఏళ్లుగా అంతా హ్యాపీ. సడన్‌గా పోలీసులు వచ్చి బాబీని తీసుకెళ్లడం, షెరిల్‌ను షాక్‌కు గురిచేసింది.

‘ప్రపంచమంతా కళ్లముందే కూలిపోతున్నట్లనిపించింది. పేపర్ల నిండా బాబీ అరెస్టు వార్తలే’..గుర్తుచేసుకుంది షెరిల్‌. ‘పెళ్లయి 30 యేళ్లయింది. నలుగురు ఎదిగిన పిల్లలు. నాకెప్పుడూ చెప్పలేదు.నాకు చాలా కోపమొచ్చింది. కానీ ఆయన్ని మాత్రం అసహ్యించుకోలేదు. ఎందుకంటే బాబీ చాలా మంచివాడు. మమ్మల్ని చాలా బాగా చూసుకున్నాడు’.షెరిల్‌ కళ్లనిండా ఆనందం. ‘నేను ఆయనకు అండగా ఉండాలనుకున్నాను. నీకు నేనున్నానని చెప్పాలనుకున్నాను’.

ఆనాటినుండి షెరిల్‌ తిరగని లాయర్‌ లేడు. కలవని పోలీస్‌ అధికారి లేడు. పలకరించని నాయకుడు లేడు. అఖరికి అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు కూడా ఉత్తరం రాసింది. గవర్నర్‌ను కూడా కలిసి భర్త తరపున వాదించింది. ఆఖరికి 2016లో బాబీ విడుదలయ్యాడు.

‘నా భుజాలమీద ఉన్న పెద్ద బరువును దించుకున్నట్లయింది’ అన్నాడు బాబీ విడుదలైన రోజు. ‘భార్యాపిల్లలతో సంతోషమయమైన జీవితాన్ని నాశనం చేసుకోవడం ఇష్టంలేక, షెరిల్‌కు నిజం చెప్పలేదు. కానీ, అది నా గుండెల్లో కుంపటిలాగే రగులుతూండేది’ తలుచుకున్నాడు బాబీ. అన్నట్లు ఇప్పుడు వాల్టర్‌ మిల్లర్‌ చట్టబద్ధంగా తన పేరును బాబీ లవ్‌గా మార్చుకున్నాడు.

సోషల్‌మీడియాను పట్టికుదిపేసిన బాబీ-షెరిల్‌ల జీవితగాథ ఎందరి హృదయాలనో ద్రవింపచేసింది. చాలామంది తడిదేరిన గుండెలతో పోస్టులు పెట్టారు. ప్రముఖ నటి జెన్నిఫర్‌ గార్నర్‌ ‘ఇది ఎంతో అందమైన, స్ఫూర్తివంతమైన ప్రేమ కథ. నేనెప్పుడూ వినలేదు’ అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పింది. హ్యుమన్స్‌ ఆఫ్‌ న్యూయార్క్‌ పేజీకి కూడా ధన్యవాదాలు తెలిపింది.’నిజానికి ఈ స్టోరీని నెట్‌ఫ్లిక్స్‌లో సీరీస్‌గా తీయాలి’ అని ఓ ఫాలోయర్‌ సలహా. న్యూయార్క్‌లోని చాలామందిని అంతలా కట్టిపడేసింది బాబీ-షెరిల్‌ల లవ్‌స్టోరీ. షెరిల్‌ లవ్‌ మన సతీ సావిత్రిలా లేదూ..! మణిరత్నం ‘రోజా’లా కూడా…..

Read more RELATED
Recommended to you

Exit mobile version