ఏపీలో కలిసి సాగుతున్న బీజేపీ,జనసేన మధ్య అధిపత్యపోరుకు తెరలేచిందా అన్న కొత్త చర్చ ఊపందుకుంది. సాధారణ ఎన్నికలు ఇంకా చాలా సమయం ఉన్నా.. అప్పుడే సీఎం అభ్యర్థి పై రెండు పార్టీలు వేర్వేరు ప్రకటనలు జారీ చేస్తూ కొత్త చర్చకు బాటలు వేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉన్నా.. సీఎం పీఠంపై కుస్తీ పడుతున్నాయి రెండు పార్టీలు. పవనే సీఎం అభ్యర్థి అని జనసేన అంటుంటే.. బీసీ జపం అందుకున్నారు సోము వీర్రాజు.
ఆ మధ్య తిరుపతి లోక్‌సభకు జరిగే ఉప ఎన్నికలో సీటు బీజేపీకి ఇచ్చేట్టు అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని జనసేన పట్టుబట్టింది. తిరుపతిలో జరిగిన జనసేన సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది కూడా. అప్పట్లోనే దీనిపై రెండు పార్టీలతోపాటు రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరిగింది. జనసేన ప్రస్తావించిన ఈ విషయంపై బీజేపీ ఏ సందర్భంలోనూ స్పందించలేదు. కానీ.. తాజాగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చేసిన కామెంట్స్.. వాటికి సమాధానమా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
బీసీ సీఎం అని కొత్త పల్లవి అందుకున్నారు సోము వీర్రాజు. దేశంలో బీసీలు బీజేపీతోనే ఉన్నారని.. పార్టీ ఒక బీసీని ప్రధానిని చేసిందని చెప్పారాయన. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీలు బీసీని ముఖ్యమంత్రిగా చేయగలవా అని ఆయన ఛాలెంజ్ కూడా చేశారు. ఆ పని బీజేపీ మాత్రమే చేయగలదని నర్మగర్భ వ్యాఖ్యలతో కలకలం రేపారు వీర్రాజు. ఏపీలో అధికారంలోకి వస్తే బీసీని సీఎంను చేస్తామని వీర్రాజు ప్రకటించకపోయినా.. పరోక్షంగా అదే అభిప్రాయాన్ని ఆయన వెలిబుచ్చారు. దీంతో కొత్త చర్చ మొదలుపెట్టినట్టు అయింది.
ఇప్పటికే జనసేన అధ్యక్షుడు సీఎం అభ్యర్థి అంటూ ఆ పార్టీ కార్యకర్తలు హడావిడి చేస్తున్నారు. ఇదే సమయంలో వీర్రాజు బీసీ ప్రస్తావన తేవడం వెనుక ప్యూహం ఏంటి..జనసేన దూకుడుకు అడ్డుకట్ట వేయాలని చూశారా అన్నది చర్చగా మారింది. నిజంగా ఇది పార్టీ నిర్ణయమే అయితే దానికి జనసేన కూడా మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. మిత్రపక్షాలుగా ఉన్న కారణంగా ఇలాంటి విధాన నిర్ణయాలు కలిసి తీసుకోవాలి. అందుకే బీజేపీ ప్రతిపాదనకు పవన్ పార్టీ అంగీకరిస్తుందా అన్నది ప్రశ్నే.
తిరుపతిలో పోటీపై సోము వీర్రాజు తమను సంప్రదించకుండా ప్రకటన చేయడంపై జనసేన అప్పట్లోనే అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పుడు ఏకంగా సీఎం అభ్యర్ధి ఏ వర్గం వారు ఉండాలన్నదానిపై వీర్రాజు ప్రకటన చేయడం మరింత ఆసక్తిగా మారింది. ఇది పార్టీలో చర్చించిన తరువాత జరిగిన ప్రకటన లేక ప్రత్యర్థి పక్షాలకు చేసిన రాజకీయ సవాలా అనేది కూడా తేలాల్సి ఉంది. దీనిపై జనసేన రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.