బాబు ఈ నేత‌ల ప్లేస్‌ను రీ ప్లేస్ చేస్తావా…!

-

2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ప్రతిపక్ష టీడీపీ నిదానంగా పుంజుకుంటున్న విషయం తెలిసిందే. జగన్ ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాలకే పరిమితం కావడంతో నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది అందుబాటులో లేక‌పోతున్నార‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల్లో ఓడిపోయినా కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి ప‌ట్టు చిక్కే ఛాన్సులు ఉన్నా పార్టీ నేత‌లు వాటిని అందిపుచ్చుకోలేక పోతున్నారు.  ఇక‌ పార్లమెంట్ స్థానాల్లో కూడా వైసీపీ ఎంపీలు అడ్రెస్ లేకుండా పోయారు. గెలిచిన 22 మందిలో ఓ నలుగురో, అయిదుగురో మాత్రమే యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. ఇక జగన్ గాలిలో గెలిచిన మిగిలిన ఎంపీలు కంటికి కనిపించడం లేదు. ఇదే సమయంలో పార్లమెంట్ స్థానాల్లో ఓడిపోయిన టీడీపీ నేతలు సైతం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలేని స్థితిలో ఉన్నారు.

చాలా చోట్ల టీడీపీకి సరైన నాయకత్వం లేదు. గెలిచిన మూడు స్థానాలు అంటే శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు స్థానాలు పక్కనబెడితే, మిగిలిన 22 స్థానాల్లో టీడీపీ పార్లమెంట్ అభ్యర్ధులు అంతగా యాక్టివ్‌గా లేరు. అలాగే కొన్ని స్థానాల్లో టీడీపీకి నాయకత్వమే లేదు. కొన్ని పార్లమెంట్ స్థానాల్లో ఓడిపోయిన నేతలు వైసీపీలోకి జంప్ కొట్టేశారు. అనకాపల్లిలో ఓడిన ఆడారి ఆనంద్ కుమార్, మొదట్లోనే వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఇక ఒంగోలులో ఓడిపోయిన శిద్ధా రాఘవరావు, నెల్లూరులో ఓడిపోయిన బీదా మస్తాన్ రావులు వైసీపీ కండువా కప్పేసుకున్నారు. తాజాగా కాకినాడలో పోటీ చేసి ఓడిన చలమలశెట్టి సునీల్ కూడా జగన్‌కు జై కొట్టారు. అలాగే చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ మృతి చెందారు.

ఈ ఐదు స్థానాల్లో అసలు పార్ట‌కి బాధ్యులే లేరు. ఇక రాజ‌మండ్రిలో ఓడిన ముర‌ళీ మోహ‌న్ కోడ‌లు రూపాదేవి రాజ‌కీయ స‌న్యాసం చేసిన‌ట్టే అని తెలుస్తోంది. ఏలూరులో ఓడిన మాజీ ఎంపీ మాగంటి బాబు రాజ‌కీయాల‌కు దూర‌మైపోయారు. ఆయ‌న అనారోగ్యంతో ఇక రాజ‌కీయాల్లోకి వ‌చ్చే ఛాన్స్ లేదంటున్నారు. న‌ర‌సాపురంలో ఎంపీగా ఓడిన మాజీ ఎమ్మెల్యే శివ చంద్ర‌బాబుపై గుస్సాతో పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇక రాయ‌ల‌సీమ‌లో అనంత‌పురం జిల్లాలో బీకే. పార్థ‌సార‌థి హిందూపురంలో, అనంత‌పురంలో జేసీ ప‌వ‌న్ యాక్టివ్‌గా ఉంటున్నారు. క‌డ‌ప‌లో ఓడిన ఆదినారాయ‌ణ రెడ్డి సైతం బీజేపీలోకి వెళ్లిపోగా రాజంపేట‌లో ఓడిన స‌త్య‌ప్ర‌భ రాజ‌కీయాల‌కు రాంరాం చెప్పేశారు.

క‌ర్నూలులో ఓడిన కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి టీడీపీలో ఉండాలా ? వ‌ద్దా ? అన్న సందిగ్ధంలో ఉన్నారు. నంద్యాల‌లో ఓడిన మాండ్ర శివానంద‌రెడ్డి ఉన్నంత‌లో ప‌ర్వాలేదు. ఇక అర‌కులో ఓడిన మాజీ కేంద్ర మంత్రి వైరిచ‌ర్ల కిషోర్ చంద్ర‌దేవ్ రాజ‌కీయం ముగిసింది. విజ‌య‌న‌గ‌రంలో ఓడిపోయిన మ‌రో కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గ‌జ‌ప‌తిరాజు కూడా రాజ‌కీయాల‌కు దూర‌మైన‌ట్టే..! ఇక ఈ స్థానాల్లో అర్జెంట్‌గా నాయకులని పెట్టాల్సిన అవసరముంది. అలాగే ఎన్నికల్లో ఓడిపోయి అడ్రెస్ లేకుండా పోయిన నేతలనీ కూడా యాక్టివ్ చేయాల్సిన అవసరముంది. చంద్రబాబు అర్జెంట్‌గా ఆ పనిచేస్తే పలు పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ పుంజుకునే ఛాన్స్ ఉంది. అలా కాకుండా ఎన్నికల సమయానికి నాయకులని తీసుకొస్తే చేసేదేం ఉండ‌ద‌ని పార్టీ కేడ‌రే చెపుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version