రఘురామకు…పవన్-బాబు సపోర్ట్ ఉంటుందా?

-

ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం క్లైమాక్స్‌కు చేరుకున్నట్లు కనిపిస్తోంది. సొంత పార్టీ పైనే ఏడాది నుంచి విమర్శలు చేస్తూ వస్తున్న రఘురామకు వైసీపీ అధిష్టానం చెక్ పెట్టేలా ఉంది. ఇప్పటికే రఘురామపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సొంత పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న రఘురామ ఎంపీ పదవి డిస్‌క్వాలిఫై చేయాలని కోరుతున్నారు.

తాజాగా కూడా ఎంపీ మార్గాని భరత్, స్పీకర్‌ని మరొకసారి కలిసి రఘురామపై వేటు వేయాలని కోరారు. పైగా ఇటీవలే సీఎం జగన్ ఢిల్లీకి వెళ్ళి కేంద్ర పెద్దలని కలిసి వచ్చారు. ఈ క్రమంలోనే రఘురామపై వేటు పడటం ఖాయమని వైసీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. త్వరలోనే రఘురామ పదవి పోవడం గ్యారెంటీ అని భరత్ చెబుతున్నారు. అయితే లోక్‌సభ స్పీకర్ తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి రఘురామ భవిష్యత్ ఉంది. వేటు పడకపోతే ఇబ్బంది లేదు. ఒకవేళ వేటు పడితే నరసాపురం పార్లమెంట్ స్థానానికి ఉపఎన్నిక వస్తుంది.

అప్పుడు రఘురామ ఎలా పోటీలోకి దిగుతారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఏపీలో వైసీపీ బలంగా ఉంది. ఆ పార్టీని ఢీకొట్టడం రఘురామకు సాధ్యమైన పని కాదు. కాకపోతే రఘురామ ఇండిపెండెంట్‌గా ఉండి, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల మద్ధతు తీసుకుంటే, కాస్త వైసీపీకి చెక్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. అదే సమయంలో రఘురామ బీజేపీలో చేరి పోటీ చేస్తే, పవన్ మద్ధతు ఎలాగో ఉంటుంది. అలాగే బాబుని అడిగితే మద్ధతు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇలా రాజుగారు మూడు పార్టీల సపోర్ట్‌తో బరిలో ఉంటే ఏదైనా ఫలితం ఉండొచ్చు.

ఎందుకంటే 2019 ఎన్నికల్లో రఘురామ వైసీపీ నుంచి పోటీ చేసి, టీడీపీపై కేవలం 32 వేల ఓట్లతో గెలిచారు. ఇక ఇక్కడ జనసేనకు దాదాపు 2.50 లక్షల ఓట్లు వచ్చాయి. అటు బీజేపీకి 12 వేల ఓట్లు వరకు పడ్డాయి. కాబట్టి రఘురామకు టీడీపీ-జనసేన-బీజేపీల మద్ధతు ఉంటే వైసీపీని ఢీకొట్టడానికి ఛాన్స్ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version