పనబాక లక్ష్మి. కేంద్ర మాజీ మంత్రి.. రాజకీయంగా సీనియర్ నాయకురాలు. చాన్నాళ్లపాటు కాంగ్రెస్‌లోనే ఉన్న ఆమె.. గత ఏడాది ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన లక్ష్మి.. తర్వాత కూడా కాంగ్రెస్‌లోనే కొనసాగినా.. మునిగిపోతున్న నావగా మారిన పార్టీలో ఎన్నాళ్లు ఉంటామని భావించి.. టీడీపీలోకి జంప్ చేశారు. ఈ క్రమంలోనే బాపట్ల ఎంపీ స్థానం ఆశించారు. అయితే, రాజకీయ సమీకరణలో భాగంగా.. ఆమెకు చంద్రబాబు తిరుపతి ఎంపీ స్థానాన్ని కేటాయించారు. అయితే ఇక్కడే మరో ప్రచారం కూడా జరిగింది. కేంద్ర మాజీ మంత్రులుగా ఉన్న పనబాక, కోట్ల సూర్యప్రకాశ్, వైరిచర్ల కిషోర్‌చంద్రదేవ్ ముగ్గురు ఎన్నికలకు ముందే టీడీపీ కండువాలు కప్పుకుని సైకిల్ గుర్తుపై పోటీ చేశారు. రాహుల్ గాంధీ కోటాలో చంద్రబాబు వీరికి టీడీపీ టిక్కెట్లు ఇచ్చారన్న ప్రచారం కూడా జరిగింది.
ఇక పనబాక పోటీ చేసిన తిరుపతి ఎంపీ స్థానంలో టీడీపీకి బలం లేదు. పార్టీ పెట్టిన తర్వాత.. టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది ఒకే ఒక్కసారి అది కూడా అన్నగారు ఎన్టీఆర్ హయాంలోనే. తర్వాత చంద్రబాబు హయాంలో ఒక్కసారి కూడా ఇక్కడ గెలుపుగుర్రం ఎక్కింది లేదు. పైగా ఎప్పుడు బీజేపీతో పొత్తు ఉంటే.. అప్పుడు ఈ టికెట్‌ను ఆ పార్టీకి కేటాయిస్తూ వచ్చారు. 2014 ఎన్నికల్లో కూడా ఈ సీటును బీజేపీకి ఇవ్వగా ఓడిపోయింది. ఎస్సీ వర్గానికి రిజర్వ్ చేసిన ఈ నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి దారుణమని తెలిసి కూడా పనబాక పోటీ చేశారు.
భారీ పోటీ నెలకొన్నప్పటికీ.. వైఎస్ జగన్ హవా భారీ ఎత్తున వీచినప్పటికీ.. కూడా పనబాక లక్ష్మి.. 4 లక్షల 94 వేల పైచిలుకు ఓట్లను సాధించారు. ఓడిపోయినప్పటికీ ఆమె భారీ ఓటింగ్ వచ్చినా కూడా వైసీపీ ఏకంగా 2.28 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఇక, ఇప్పుడు ఇక్కడ నుంచి గెలిచిన బల్లి దుర్గా ప్రసాద్ హఠాన్మరణంతో .. త్వరలోనే ఉప ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ ఇక్కడ పోటీకి రెడీ అవుతోన్న సంకేతాలు పంపుతోంది. ఇక కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత చింతా మోహన్ రంగంలో ఉంటాడని తెలుస్తోంది.
ఇక ఆ రెండు పార్టీలు పోటీ చేస్తే టీడీపీ కూడా తప్పక రేసులో ఉంటుందని అంటున్నారు. ఇక్కడ గెలుపు కన్నా బలం ఎంతో ఫ్రూవ్ చేసుకోవాలన్నదే టీడీపీ ఆలోచన. ఈ నేపథ్యంలో టీడీపీ టికెట్ తిరిగి పనబాక లక్ష్మికే దక్కుతుందా ? చంద్రబాబు ఆమెకు ఇస్తారా ? అనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి గత ఏడాది ఎన్నికల తర్వాత.. పనబాక లక్ష్మి కుటుంబం రాజకీయాలకు దూరంగా ఉంటోంది. అయితే, పార్టీ మారలేదు. ఈ నేపథ్యంలో ఆమెకు ఇచ్చే ఛాన్స్ ఉందని కొందరు అంటున్నారు.
కానీ, ఎన్నికల తర్వాత యాక్టివ్‌గా లేరు కాబట్టి.. పార్టీలో ప్రధాన కార్యదర్శి, 2004లో ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వర్ల రామయ్యకు ఇస్తారని మరికొందరు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఏదేమైనా.. ఏడాది కాలంలో కొన్నాళ్లయినా .. యాక్టివ్‌గా ఉండి వుంటే.. పనబాకకు ఇప్పుడు మళ్లీ చంద్రబాబు టికెట్ ఇచ్చి ఉండేవారనే అభిప్రాయం వ్యక్తం కావడం గమనార్హం.
-Vuyyuru Subhash