ఏపీలో రాజకీయ పరిస్తితులు ఎప్పుడు ఎలా ఉన్నా సరే, ఓ ఐదు జిల్లాల్లో మాత్రం ఎప్పుడు వైసీపీకే అనుకూల పరిస్తితులు ఉంటాయని చెప్పొచ్చు. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి, రాష్ట్రం మొత్తం ఆ పార్టీ హవా కనిపిస్తోంది. అయితే పార్టీ అధికారంలో ఉన్నా, లేకపోయినా ఓ ఐదు జిల్లాల్లో మాత్రం వైసీపీకే లీడింగ్ ఉంటుందని చెప్పొచ్చు. ఆ ఐదు జిల్లాలే వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగన్(jagan) ని సీఎంగా నిలబెట్టే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
అలా జగన్‌కు అండగా ఉన్న ఐదు జిల్లాలు వచ్చి..కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు. వైసీపీ పెట్టిన దగ్గర నుంచి ఆ ఐదు జిల్లాల్లో వైసీపీ బలంగా కనిపిస్తోంది. 2014లో రాష్ట్రం మొత్తం టీడీపీ గాలి ఉన్నా సరే, ఈ ఐదు జిల్లాల్లో వైసీపీ హవా నడిచింది. కడపలో 10 సీట్లు ఉంటే వైసీపీ 9 గెలుచుకుంది. అటు కర్నూలు 14 సీట్లు ఉంటే 11, చిత్తూరులో 14 సీట్లు ఉంటే 8, నెల్లూరులో 10 సీట్లు ఉంటే 7, ప్రకాశంలో 12 సీట్లు ఉంటే 6 చోట్ల వైసీపీ విజయం సాధించింది.
ఇక 2019 ఎన్నికల్లో ఎలాంటి పరిస్తితి ఉందో చెప్పాలసిన పనిలేదు. కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో వైసీపీ క్లీన్‌స్వీప్ చేయగా, చిత్తూరులో 14కి 13, ప్రకాశంలో 12కి 8 సీట్లు గెలుచుకుని సత్తా చాటింది. ఇప్పటికీ ఆ జిల్లాల్లో వైసీపీ బలంగా ఉన్నట్లే కనిపిస్తోంది.
వచ్చే ఎన్నికల్లో సైతం ఈ జిల్లాల్లో వైసీపీ హవా కొనసాగేలా ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇవే జగన్‌ని మళ్ళీ అధికార పీఠంలో కూర్చోబెట్టిన ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు.