ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఏపీ రాజకీయాలను ఇప్పుడు శాసిస్తుంది మాత్రం వైసీపీ పార్టీ అనే చెప్పాలి. ఏ పార్టీకి లేనంత మెజార్టీ ఇప్పుడు ఆ పార్టీ సొంతం. గతంతో కూడా ఎవరికీ సాధ్యం కానంత మెజార్టీని సాధించింది అంటే అదంతా జగన్ వేవ్ అనే చెప్పక తప్పదు. కాగా ఇలాంటి తరుణంలో ఏపీ వైసీపీ పార్టీలో ఇప్పుడు ఒకే ఒక్క అంశం గురించి మల్లగుల్లాలు పడుతున్నారు రాజకీయ నేతలు. అటు మంత్రులను, ఇటు ఎమ్మెల్యేలకు టెన్షన్ పెడుతోంది ఆ విషయం. అదేదో కాదు ప్రభుత్వంలో ఉన్న మంత్రుల మార్పు.
అయితే గతంలో కూడా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు కూడా ఇలాంటి డేరింగ్ స్టెప్ తీసుకున్నారు. తన ప్రభుత్వంలో ఉన్న మంత్రుల్లో దాదాపు ఒకేసారి 30 మందిని మార్చేసి సంచలనం సృష్టించారు. అయితే ఇది ఆయన అనూహ్యంగా తీసుకున్న నిర్ణయం కావడంతో వారంతా కూడా ఎన్టీఆర్ మీద తీవ్ర అసంతృప్తితో రగిలిపోయారు. ఇంకేముంది పార్టీలో గ్రూపులు మొదలై పెద్ద ఎత్తున కుమ్ములాటలకు తెరలేపారు పదవి కోల్పోయిన వారంతా కూడా. ఇదే ఆయన ప్రభుత్వానికి పెద్ద మచ్చ తెచ్చింది.
ఇక దాంతో 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడానికి ఇది పెద్ద కారణంలా నిలిచింది. కాగా ఇప్పుడు జగన్ కూడా అలాంటి డేరింగ్ స్టెప్ తీసుకుంటున్నారు. అయితే ఇది ఆయన అనూమ్య నిర్ణయం కాదు. ఆయన గెలిచిన మొదట్లోనే రెండున్నరేళ్ల తర్వాత మంత్రుల మార్పు ఉంటుందని చెప్పేశారు. కాబట్టి ఇప్పుడు మార్పులు చేసినా కూడా పెద్ద నష్టమేమీ జరగదని ఆయన భావిస్తున్నారు. మరి రాజకీయాలు అన్న తర్వాత పదవి కోల్పోతే బాధ పడకుండా ఉంటారా. కానీ ఏం జరుగుతోందో వేచి చూడాలి మరి.