బీజేపీలో చేరిన గంటకే తిరిగి టీఆర్ఎస్‌లోకి.. !

-

రాజ‌కీయం అంటేనే మాయ‌… ఈ రోజు ఒక పార్టీలో ఉన్న నేత‌లు రేపు ఏ పార్టీలో ఉంటారో.. ఆ మ‌రుస‌టి రోజు ఏ పార్టీలో ఉంటారో తెలియ‌దు. అధికారం కోసం ఎలాగైనా అర్రులు చాస్తుంటారు. ప్ర‌స్తుత ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ 2004 ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ సీటు రాలేద‌ని తెల్లారేస‌రికి టీడీపీ కండువా క‌ప్పేసుకుని ఎమ్మెల్యే సీటు ద‌క్కించుకున్నారు. ఎన్నిక‌ల్లో ఆయ‌న గెలిచినా టీడీపీ అధికారంలోకి రాలేద‌ని మ‌ళ్లీ వెంట‌నే కాంగ్రెస్‌లోకి వెళ్లి ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2014లో ఇంత‌క‌న్నా విచిత్రం జ‌రిగింది. ప్ర‌స్తుత మ‌ల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంప‌ల్లి హ‌న్మంత‌రావు టీడీపీ సీటు రాలేద‌ని వెంట‌నే ఫ్లైట్లో ఢిల్లీ వెళ్లి మ‌రుస‌టి రోజు కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు. ఆ మ‌రుస‌టి రోజు హైద‌రాబాద్ వ‌చ్చిన వెంట‌నే గులాబీ కండువా క‌ప్పుకుని మ‌ల్కాజ్‌గిరి ఎంపీగా పోటీ చేశారు. అంటే ఆయ‌న మూడు రోజుల్లో మూడు పార్టీలు మారారు.

తాజాగా గ్రేట‌ర్ ఎన్నిక‌ల వేళ న‌గ‌రంలో చిత్ర విచిత్ర‌మైన రాజ‌కీయాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న ఒక పార్టీలో ఉన్న నేత‌లు రేపు ఇంకో పార్టీలోకి వెళ్లిపోతున్నారు. టిక్కెట్లు రాని వాళ్లు, అసంతృప్త‌, అస‌మ్మ‌తి నేత‌లు సులువుగానే కండువాలు మార్చేస్తున్నారు. అయితే ఇందుకు భిన్న‌మైన సంఘ‌ట‌న జ‌రిగింది. రామ‌చంద్రాపురం సిట్టింగ్ కార్పొరేట‌ర్ తొంట అంజ‌య్య‌కు టీఆర్ఎస్ అధిష్టానం టిక్కెట్ ఇవ్వ‌లేదు. టీఆర్ఎస్ ఓ 20 మంది కార్పొరేట‌ర్ల‌కు సీట్లు ఇవ్వ‌లేదు. ఈ లిస్టులో అంజ‌య్య కూడా ఉన్నాడు. దీంతో టీఆర్ఎస్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన అంజ‌య్య నిన్న మ‌ధ్యాహ్నం బండి సంజ‌య్ స‌మ‌క్షంలో కాషాయ కండువా క‌ప్పుకున్నారు.

మంత్రి హ‌రీష్‌రావుకు అంజ‌య్య స‌న్నిహితుడు. ఈ విష‌యం తెలుసుకున్న హ‌రీష్‌రావు వెంట‌నే రంగంలోకి దిగ‌డంతో పాటు రామ‌చంద్రాపురంలో అంజ‌య్య ఇంటికి వెళ్లి బుజ్జ‌గించారు. భ‌విష్య‌త్తులో మ‌రో మంచి అవ‌కాశం క‌ల్పిస్తాము.. పార్టీ విజ‌యానికి కృషి చేయాల‌ని సూచించారు. దీంతో వెంట‌నే అంజ‌య్య హ‌రీష్ స‌మ‌క్షంలో కాషాయ కండువా తీసేసి గులాబీ కండువా క‌ప్పేసుకున్నారు. రెండు రోజుల వ్య‌వ‌ధిలోనే పార్టీ నుంచి జంప్ చేసి.. మ‌ళ్లీ రీ జంప్ చేశారు. మ‌రి గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో, ఫ‌లితాల్లో ఇలాంటి సిత్ర విచిత్రాలు ఇంకెన్ని చూడాలో…?

Read more RELATED
Recommended to you

Exit mobile version