కరోనా నేపథ్యంలో భారత్‌లో ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్‌ను కోవిషీల్డ్ రూపంలో ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే పలు ఇతర దేశాలకు కూడా భారత్ నుంచి ఈ వ్యాక్సిన్‌ను ఎగుమతి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆస్ట్రాజెనెకాకు చెందిన రెండు కోవిడ్ వ్యాక్సిన్లకు అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. దీంతో ప్రపంచంలో చాలా పేద దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ లభ్యం కానుంది.
కోవాక్స్ అనే కార్యక్రమం ద్వారా ప్రపంచ ఆరోగ్య సంస్థ దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో పేద దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్‌ను అందించేందుకు గతంలోనే ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే ఆస్ట్రాజెనెకాకు చెందిన రెండు వ్యాక్సిన్లకు అనుమతి లభించడంతో కోవాక్స్ ద్వారా పేద దేశాలకు వ్యాక్సిన్లను సరఫరా చేస్తారు. దీంతో వారికి కూడా వ్యాక్సిన్ సకాలంలో లభిస్తుంది.
ఇక భారత్‌లో వాడుతున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ కరోనాపై 92 శాతం వరకు సమర్థవంతంగా పనిచేస్తుందని గతంలోనే తెలిపారు. అందుకు గాను రెండు డోసులను తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్‌లకు చెందిన ఒక వ్యాక్సిన్ వేరియెంట్. ఇక రెండో వేరియెంట్‌ను ఆస్ట్రాజెనెకా-ఎస్కే బయోలు ఉత్పత్తి చేస్తున్నాయి. ఆ వేరియెంట్ 63 శాతం వరకు ప్రభావం చూపిస్తుందని వెల్లడైంది. ఇక ఇప్పటికే అమెరికాకు చెందిన ఫైజర్-బయోఎన్‌టెక్ కోవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇచ్చింది.