హెపటైటిస్ వ్యాధి రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తల్లో ఒకటి.. వ్యక్తిగత పరిశుభ్రత. ప్రతి ఒక్కరు తమను, పరిసరాలను శుభ్రంగా, సురక్షితంగా ఉంచుకోవడం ద్వారా హెపటైటిస్ వ్యాధి రాకుండా చూసుకోవచ్చు.
హెపటైటిస్ అనేది లివర్ వాపునకు సంబంధించిన వ్యాధి. ఈ వ్యాధితో లివర్ నెమ్మదిగా చెడిపోతుంటుంది. దీంతో లివర్ పనితీరు క్రమంగా మందగిస్తుంది. ఈ క్రమంలో పలు ఇతర అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అందుకనే ప్రతి ఒక్కరు లివర్ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. లివర్ చెడిపోకుండా చూసుకోవాలి. ఈ క్రమంలోనే హెపటైటిస్ వ్యాధి పట్ల అందరికీ అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా జూలై 28వ తేదీని వరల్డ్ హెపటైటిస్ డేగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇన్వెస్ట్ ఇన్ ఎలిమినేటింగ్ హెపటైటిస్ అనే థీమ్‌తో ఈ డేను నిర్వహించేలా అందరినీ హెపటైటిస్ వ్యాధి పట్ల చైతన్య పరుస్తోంది. 2030 వరకు ప్రపంచ వ్యాప్తంగా హెపటైటిస్ వ్యాధిని లేకుండా చేయాలన్నదే ఈ డే లక్ష్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు తమ లివర్ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని, తమ తమ కుటుంబాల్లోనూ ఈ వ్యాధి పట్ల అందరికీ అవగాహన కల్పించాలని డబ్ల్యూహెచ్‌వో సూచిస్తోంది.
హెపటైటిస్ వ్యాధి రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తల్లో ఒకటి.. వ్యక్తిగత పరిశుభ్రత. ప్రతి ఒక్కరు తమను, పరిసరాలను శుభ్రంగా, సురక్షితంగా ఉంచుకోవడం ద్వారా హెపటైటిస్ వ్యాధి రాకుండా చూసుకోవచ్చు. భోజనం చేసే సమయంలో, మల, మూత్ర విసర్జన సమయంలో, మట్టిలో ఆడినప్పుడు, ఇతర సమయాల్లో ఎప్పటి కప్పుడు చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఇల్లు, ఇంటి పరిసరాల్లోనూ ఎలాంటి చెత్త, వ్యర్థాలు, నీరు పేరుకుపోకుండా చూసుకోవాలి. దీంతో ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. ఇక భోజనం వండేవారు కూడా చేతులను, పాత్రలను శుభ్రంగా ఉంచుకోవాలి. నాణ్యమైన ఆహారపదార్థాలనే వండుకోవాలి. స్వచ్ఛమైన నీటినే వంటకు ఉపయోగించాలి. దీంతో హెపటైటిస్ రాకుండా అడ్డుకోవచ్చు.
మనలో చాలా మందికి వీధిలో దొరికే చిరు తిండ్లు తినే అలవాటు ఉంటుంది. అయితే చిరుతిండి తినాలని అనుకుంటే ఇంట్లోనే చేసుకుని తినడం ఉత్తమం. బయటి ఫుడ్స్‌ను తినడం వల్ల హెపటైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఇంట్లో మాంసం తినాలని అనుకుంటే దాన్ని బాగా మెత్తగా అయ్యేవరకు బాగా ఉడికించి తినాలి. దీంతో వాటిల్లో ఉండే క్రిములు నశిస్తాయి. ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగకూడదు. కేవలం మినరల్ వాటర్‌ను మాత్రమే తాగాలి. అలాగే ఆహారం తీసుకునే విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాల్లో అందుబాటులో ఉండే ఆహార పదార్థాలు లేదా క్లీన్‌గా లేని హెటల్స్‌లో ఫుడ్‌ను తీసుకోకపోవడమే ఉత్తమం. ఇక వీలైనంత వరకు బయట పండ్ల రసాలు, ఐస్ క్యూబ్‌లు తీసుకోవడం మానేయాలి.
హెపటైటిస్ రాకుండా ఉండేందుకు మనకు పలు రకాల టీకాలు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ సూచన మేరకు హెపటైటిస్ ఎ లేదా బి కి చెందిన టీకాలను వేయించుకుంటే ఆ వ్యాధులు రాకుండా ఉంటాయి. హెపటైటిస్ అనేది అంటు వ్యాధి కనుక ప్రతి ఒక్కరు పైన చెప్పిన విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తే ఆ వ్యాధులను రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే లివర్ ఆరోగ్యంగా ఉంటుంది.