ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం జనాభా విపరీతంగా పెరుగుతోంది. దీని ప్రభావం భూమిపై పడుతోంది. అలాగే జీవవైవిధ్యం కూడా దెబ్బ తింటోంది. దీంతో జనాభాకు కావల్సిన ఆహారం, ఇతర సదుపాయాలు చాలినన్ని లభించడం లేదు. ఈ క్రమంలో మనిషి తన అవసరాల కోసం ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. పర్యావరణ వ్యవస్థను దెబ్బ తీస్తున్నాడు. అతను చేస్తున్న అనేక పనుల వల్ల జీవుల మధ్య సమతౌల్యం దెబ్బ తింటోంది. భూమికి అన్ని విధాలుగా నష్టం కలుగుతోంది.
గత 50 ఏళ్ల కాలంలోనే ప్రపంచ జనాభా 3 బిలియన్ల నుంచి 7 బిలియన్లకు పెరిగింది. ఈ క్రమంలో వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్విరాన్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ చెబుతున్న లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా భూమిపై ఉన్న ప్రతి మనిషికి కేవలం 1.7 హెక్లార్ల భూమి మాత్రమే అందుబాటులో ఉంది. దీన్ని బట్టి చూస్తే మనిషి ఎంత ప్రమాదంలో ఉన్నాడో ఇట్టే అర్థమవుతుంది. మనం సురక్షితమైన జీవనం వైపు అడుగులు వేయడం లేదని తెలుస్తుంది.
కాలుష్యం…
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం కాలుష్యం ఎంత ఎక్కువ పెరిగిందో అందరికీ తెలిసిందే. ప్రధాన నగరాలు, పట్టణాలతోపాటు ఒక మోస్తరు ప్రాంతాల్లో.. ఆ మాటకొస్తే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం అన్ని రకాల కాలుష్యాలు పెరుగుతున్నాయి. దీని వల్ల వాతావరణంలో సల్ఫర్ డయాక్సైడ్ పెరిగి ఆమ్ల వర్షం కురుస్తుంది. ఇది భూమిపై ఉండే మానవులకే కాదు, ఇతర జీవరాశులకు ఎంత మాత్రం సురక్షితం కాదు. దీంతో అనేక దుష్పరిణామాలు సంభవిస్తాయి. జీవవైవిధ్యం దెబ్బ తింటుంది.
మురుగు నిర్వహణ…
ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో ప్రస్తుతం మురుగునీటి నిర్వహణను సరిగ్గా చేపట్టడం లేదు. వ్యర్థాలను సివరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లలో ట్రీట్ చేయకుండానే నదుల్లోకి వదులుతున్నారు. దీంతో నీటిలో నివసించే జీవరాశులకు ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోంది. అనేక జాతులకు చెందిన జీవరాశులు అంతరించిపోతున్నాయి. నీటిలో ఆయా ప్రాణులకు ఆక్సిజన్ అందక చనిపోతున్నాయి. ఇది కూడా పర్యావరణం, జీవవైవిధ్యంపై ప్రభావం చూపుతోంది.
అడవుల విస్తీర్ణం…
పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చేందుకు కావల్సిన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రస్తుతం అడవులను ఎక్కువగా నరికివేస్తున్నారు. దీంతో అటవీ విస్తీర్ణం గణనీయంగా తగ్గుతోంది. దీని వల్ల జీవరాశులకు కావల్సిన ప్రాణవాయువు (ఆక్సిజన్) లభించడం లేదు. వర్షాలు సకాలంలో కురవడం లేదు. అయితే అతివృష్టి.. లేదా అనావృష్టి.. అన్న చందంగా మారింది. దీంతోపాటు పర్యావరణం, జీవవైవిధ్యంపై కూడా ఆ ప్రభావం పడుతోంది.
ఎడారులుగా మారడం…
అడవులను నరికివేస్తుండడం.. భూగర్భ జలాలను తోడేస్తుండడంతో.. అనేక ప్రాంతాలు ఎడారులుగా మారుతున్నాయి. ఎట్టి పరిస్థితిలోనూ ఆ ప్రాంతాలు నివాసాలకు అనుకూలంగా ఉండడం లేదు. ఇది జీవవైవిధ్యాన్ని దెబ్బ తీస్తోంది. పలు జీవరాశులు అంతరించిపోయేందుకు కారణమవుతోంది.
క్రిమి సంహారక మందుల వాడకం…
ప్రస్తుతం సేంద్రీయ వ్యవసాయం పట్ల ప్రజల్లో అవగాహన వస్తోంది.. కానీ అనేక మంది ఇప్పటికీ కృత్రిమ రసాయనాలను అధికంగా వాడుతూ పంటలను పండిస్తున్నారు. దీంతో ఆ పంటలు పండే భూములు కొన్నేళ్లకు పోషకాలు లేని నిస్సారవంతమైన భూములుగా మారుతున్నాయి. సదరు మందులు వేసి పండించిన ఆహార పదార్థాలను తినడం వల్ల మనుషులకు అనేక తీవ్ర అనారోగ్య సమస్యలు సంభవిస్తున్నాయి. ఇది కూడా పర్యావరణ వ్యవస్థ దెబ్బ తినేందుకు కారణమవుతోంది.
ప్రపంచ జనాభా ఎప్పటికప్పుడు పెరుగుతున్నా.. ప్రపంచ దేశాలు ఈ విషయంపై దృష్టి సారించకుండా ముందుకు సాగుతున్నాయి. ఫలితంగా పైన చెప్పిన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అలా కాకుండా ఉండాలంటే.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రభుత్వాలు సదుపాయాలు కల్పించేలా ప్రణాళికలు చేపట్టాలి. అయితే అవి పర్యావరణానికి హాని కలిగించనివి అయి ఉండాలి. అప్పుడే జీవ వ్యవస్థ, పర్యావరణ వ్యవస్థ సురక్షితమైన జీవనం దిశగా అడుగులు వేస్తాయి.