వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం వల్ల అనేక వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా టాయిలెట్‌కు వెళ్లినప్పుడల్లా శుభ్రతను పాటించాలి. లేదంటే ఇన్ఫెక్షన్లు వస్తాయి. అవి దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీస్తాయి. ఈ క్రమంలోనే ఆరోగ్యకరమైన టాయిలెట్ అలవాట్లపై ప్రజలకు అవగాహన కలిగేలా ప్రతి ఏటా నవంబర్ 19న వరల్డ్ టాయిలెట్ డేను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మన పరిశుభ్రతకు, వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండేందుకు పాటించాల్సిన పలు ముఖ్యమైన సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. శరరీంపై కాలిన గాయాలు, పుండ్లు ఏవైనా ఉంటే వాటిని కవర్ చేసి టాయిలెట్‌కు వెళ్లాలి. లేదంటే వాటి ద్వారా శరీరంలోకి సూక్ష్మ క్రిములు ప్రవేశించి ఇన్‌ఫెక్షన్లు ఏర్పుడుతాయి. కనుక ఈ విషయంలో కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి.
2. టాయిలెట్‌ను వాడగానే కొందరు అందులో నీళ్లు పోయరు. కానీ టాయిలెట్‌ను వాడినప్పుడల్లా దాన్ని ఫ్లష్ చేయాలి. లేదంటే మలమూత్రాల్లోని సూక్ష్మ క్రిములు టాయిలెట్ అంతా వ్యాప్తి చెంది మనకు అనారోగ్యాలను తెచ్చి పెడతాయి.
3. మనం టాయిలెట్‌ను వాడాక దాన్ని మళ్లీ మనమే వాడుకోవచ్చు లేదా ఇతరులు ఉపయోగించుకోవచ్చు. కనుక దాన్ని వాడిన వెంటనే శుభ్రంగా ఉండేలా చూడాలి.
4. టాయిలెట్‌ను శుభ్రం చేసినప్పుడల్లా పూర్తిగా చేయాలి. కేవలం టాయిలెట్ సీట్‌ను మాత్రమే కాదు, అన్ని భాగాలనూ పూర్తిగా శుభ్రం చేయాలి.
5. టాయిలెట్‌ను ఉపయోగించిన వెంటనే టాయిలెట్‌లోని ఏ భాగాలను తాకరాదు. శరీర భాగాలను కూడా తాకరాదు. సబ్బు లేదా హ్యాండ్ వాష్‌తో చేతులను ముందుగా శుభ్రంగా కడుక్కోవాలి. లేదా శానిటైజర్‌ను ఉపయోగించాలి. తరువాతే ఇతర వస్తువులను తాకాలి.
6. అవసరం అనుకుంటే పోర్టబుల్ యూరినల్ డివైసెస్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇవి టెంపరరీగా వాడుకునేందుకు పనికొస్తాయి.
7. సాధ్యమైనంత వరకు ఇండియన్ స్టైల్ టాయిలెట్లనే ఉపయోగించాలి. టాయిలెట్‌ను ఎట్టి పరిస్థితిలోనూ తాకరాదు.
8. వెస్టర్న్ టాయిలెట్‌ను వాడితే టాయిలెట్ సీట్‌ను ముందుగా శుభ్రం చేసుకోవాలి. అందుకు సబ్బు ద్రావణం స్ప్రే లేదా యాంటీ సెప్టిక్ వైప్స్, సోప్ వాటర్, శానిటైజింగ్ స్ప్రేను ఉపయోగించాలి. తరువాతే టాయిలెట్‌ను ఉపయోగించాలి.
9. టాయిలెట్ తలుపులకు ఉండే హ్యాండిల్స్, లోపల ఉండే నల్లాలు, ఇతర అన్ని భాగాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. శానిటైజర్లు లేదా క్లీనింగ్ లిక్విడ్‌లను వాడాలి.
10. టాయిలెట్‌లో ఫ్లోర్‌ను ఎల్లప్పుడూ పొడిగా ఉండేలా చూడాలి. తడిగా ఉంటే సూక్ష్మ క్రిములు వృద్ది చెందుతాయన్న విషయం గుర్తుంచుకోవాలి.