ప్రపంచంలోనే అత్యంత పొడవైన కొత్తిమీర మొక్క.. ఉత్తరాఖండ్‌ రైతు గిన్నిస్‌ రికార్డ్‌..

-

ప్రపంచంలోనే అత్యంత పొడవైన కొత్తిమీర మొక్కను పెంచినందుకు గాను ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ రైతుకు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు లభించింది. అక్కడి అల్మోరా జిల్లాలోని రాణిఖెత్‌ ప్రాంతం బిల్కేష్‌ గ్రామానికి చెందిన గోపాల్‌ దత్‌ ఉప్రెటి ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. అతను పెంచిన కొత్తిమీర మొక్క 7.1 అడుగులు (2.16 మీటర్లు) ఉండడం విశేషం.

గోపాల్‌ దత్‌ తన 4 ఎకరాల పొలంలో యాపిల్స్‌ను పండిస్తున్నాడు. కొత్తిమీర, వెల్లుల్లిలను అంతర్‌ పంటలుగా సాగు చేస్తున్నాడు. ఇక తన పంటలకు అతను ఎలాంటి కృత్రిమ రసాయనాలు వాడడు. అలాగే హిమాలయన్‌ వ్యవసాయ పద్ధతుల్లో, పూర్తిగా సేంద్రీయ ఎరువులతోనే పంటలు పండిస్తాడు. ఆవు పేడతో ఎరువులను తయారు చేసి వాటిని పంటలకు వేస్తాడు. ఈ క్రమంలో కొత్తిమీర మొక్కలు అతని పొలంలో 5 అడుగుల వరకు పొడవు పెరిగేవి. కానీ సాధారణంగా అవి 4 నుంచి నాలుగున్నర అడుగుల పొడవు మాత్రమే పెరుగుతాయని వ్యవసాయ పరిశోధకులు చెబుతున్నారు. అయితే గోపాల్‌ దత్‌ పొలంలో తాజాగా పెంచిన ఆ కొత్తిమీర మొక్క మాత్రం ఏకంగా 7.1 అడుగులు పెరగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

అయితే ప్రపంచంలోనే అత్యంత పొడవైన కొత్తిమీర మొక్క పొడవు 5.9 అడుగులు కాగా ఆ మొక్క పేరిట ఇప్పటి వరకు గిన్నిస్‌ రికార్డు ఉండేది. కానీ గోపాల్‌ దత్‌ గిన్నిస్‌ బుక్‌ రికార్డ్ వారికి అప్లై చేయడంతో వారు ఆ మొక్కను పరిశీలించి ఆ మొక్క 7 అడుగులకు పైగా పొడవు ఉందని గుర్తించి దానికి గిన్నిస్‌ రికార్డు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో గోపాల్ దత్‌ త్వరలోనే ఆ రికార్డు సర్టిఫికెట్‌ పొందనున్నాడు. అయితే కేవలం సేంద్రీయ ఎరువులను వాడడం వల్ల ఆ మొక్క అంత పొడవు పెరిగిందని, కనుక రైతులందరూ ఆ విధానంలో పంటలను సాగు చేస్తే అధికంగా దిగుబడిని సాధించేందుకు అవకాశం ఉంటుందని గోపాల్‌ దత్‌ చెబుతున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version