చీరాల వదులుకోవల్సిందే..ఆమంచి దారెటు ?

-

ప్రకాశం జిల్లా చీరాల పేరు చెబితే టక్కున గుర్తుకొచ్చేది ఆమంచి కృష్ణమోహన్. రెండు సార్లు చీరాల ఎమ్మెల్యేగా పని చేసిన ఆమంచి కృష్ణమోహన్ నియోజక వర్గం పై మంచి పట్టు సాధించారు. అయితే ఇప్పుడు చీరాల నుండి ఖాళీ చెయ్యాలని ఆమంచికి క్లారిటీ ఇచ్చిందట వైసీపీ అధిష్టానం. చీరాల ప్లేస్ లో పరుచూరు పగ్గాలు చేపట్టాలని పార్టీ తగిన గౌరవం ఇస్తుందని వైసీపీ పెద్దలు హామి ఇచ్చారట..చీరాల వదిలి వెళ్తే వచ్చే లాభనష్టాల పై లెక్కలేస్తున్నారట ఆమంచి…

పట్టున్న నియోజకవర్గాన్ని వదిలేయాలంటే నేతలకు అంత తేలిక కాదు. చీరాలలో ఆమంచి కృష్ణమోహన్‌ పరిస్థితి అదే. చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలం పందిళ్లపల్లికి చెందిన ఆమంచి గతంలో వేటపాలెం ఎంపిపిగా, జడ్పీటీసీగా పని చేశారు. 2009లో కాంగ్రెస్ నుండి మొదటి సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వీడి స్వతంత్ర అభ్యర్థిగా చీరాల నుండి ఆమంచి కృష్ణమోహన్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ పోటాపోటీగా ఉన్న సమయంలో ఆమంచి రెండో సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆతరువాత గత ప్రభుత్వంలో టీడీపీలో చేరారు.

2019 ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించాలని వైసీపీలో చేరిన ఆమంచికి ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురైంది. టీడీపీ నుండి పోటీ చేసిన కరణం బలరామ్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఎన్నికల్లో ఓడినా వైసీపీ అధికారంలోకి రావడంతో చీరాలలో ఆమంచి హవాసాగింది. అయితే గత ఏడాది టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరామ్ వైసీపీ ప్రభుత్వానికి మద్దతు తెలిపి తన కుమారుడు వెంకటేష్ ని దగ్గరుండి వైసీపీలో చేర్చారు. దీంతో అప్పటి నుండి ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరామ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.

ఇప్పుడు చీరాలలో ఏదైనా కార్యక్రమం తలపెడితే…ఇరు వర్గాల క్యాడర్ కొట్టుకోవడం కామనైపోయింది. చీరాల అధికార పార్టీలో నేతల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అయితే తాజాగా చీరాల నియోజక వర్గంలో ఎన్నికలు జరుగుతున్న ఒకే ఒక్క పంచాయితీ లో రెండు వర్గాల అభ్యర్ధులూ పోటీకి దిగారు. రామన్నపేట సర్పంచ్ స్థానంతో పాటూ 14 వార్డు కోసం ఇరు వర్గాల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో రామన్నపేట పంచాయితీ ఎన్నికల వ్యవహారంతో పాటూ కరణం, ఆమంచి మధ్య వివాదం ముదిరినట్టయింది.

దీంతో చీరాల వైసీపీ వ్యవహరాలు చక్కబరిచేందుకు…వైసీపీ ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. కరణం బలరామ్, ఆమంచి కృష్ణమోహన్ తో చర్చలు జరిపారు. రామన్నపేట పంచాయితీ సర్పంచ్ పదవి ఏకగ్రీవంగా కరణం వర్గీయురాలికి ఇచ్చారు. చీరాలలో అధికార పెత్తనం పూర్తిగా కరణం బలరామ్ కి ఇచ్చారని టాక్. ఇప్పటి వరకూ చీరాల వైసీపీ ఇన్ ఛార్జ్ గా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ ని చీరాల రాజకీయంలో వేలు పెట్టొద్దని కూడా సూచించారని ఆధికార పార్టీలో చర్చ జరుగుతోందట.

చీరాల ఖాళీ చేసి పర్చూరు నియోజక వర్గం బాధ్యతలు చేపట్టాలని ఆమంచిని అధికార పార్టీ పెద్దలు ఆదేశించారట. చీరాల వదులుకుంటే పర్చూరు ఇన్ ఛార్జ్ బాధ్యతలతో పాటూ రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ పదవి కూడా ఇస్తామని ఆమంచికి ఆఫర్ చేశారట. చీరాల నియోజకవర్గంలో ఆమంచి కృష్ణమోహన్ బలమైన లీడర్ గా ఎదిగారు. ఇప్పుడు బలం ఉన్న చీరాలని వదిలి పర్చూరు వెళ్లాలా లేదా అన్న ఆలోచనలో ఆమంచి ఉన్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version