రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలతో కలిసే తాను పోటీ చేస్తానని, అందులో ఎటువంటి సందేహం లేదని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని, తనని లక్ష్యంగా చేసుకొని తన పార్టీకి చెందిన అరడజన్ మంది నాయకులు, నాయకురాళ్లు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు వెనక ఉండి ఈ విమర్శలు చేయిస్తున్నారని తెలిపారు.
జగన్ మోహన్ రెడ్డి గారు నేరుగా తమపై విమర్శలు చేయవచ్చునని, ఆయనకు కూడా ఒక ట్విట్టర్ అకౌంట్ ఉందని గుర్తు చేశారు. తన మనసులోని భావాలను ఒకటి అర ట్విట్ల రూపంలో రాయించుకుని పోస్టు చేయాలని సూచించారు. ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి గారు తనని విమర్శిస్తే ఎక్కువ మంది చూస్తారని తెలిపారు. తనపై రోజూ ఐదారు మంది పార్టీ నేతల చేత విమర్శలు చేయిస్తే, ప్రతి రోజూ వాటిని చదివి వినిపించాలంటే ఇబ్బంది అవుతుందని ఎద్దేవా చేశారు. రెండు క్రూర మృగాల మధ్య వన్యప్రాణులుగా మీరు నలిగిపోవద్దంటూ తనపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించిన నాయకులకు సూచించారు. ముఖ్యమంత్రి గారు తనని ఎంతలా రెచ్చగొట్టాలని చూసిన తాను రెచ్చిపోయేది లేదని స్పష్టం చేశారు.