95 శాతం పంచాయతీలు మావే అని గొప్పలు చెప్పిన నాయకులకు ఆశావాహులు షాకిచ్చారా..అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సిక్కోలు అధికార పార్టీలో బుజ్జగింపులు వర్కవుట్ కాకపోవడంతో వందకుపైగా పంచాయతీల బరిలో రెబల్స్ సై అంటున్నారు. దీంతో శ్రీకాకుళం జిల్లాలో పంచాయతీ సమరం రసవత్తరంగా మారింది.
తొలివిడత ఎన్నికల్లోనే ప్రతిపక్షం కంటే స్వపక్షంలోనే ఎక్కువ తిరుగుబాటుదారులు పోటీకి దిగారు. జిల్లాలో మూడు రెవిన్యూ డివిజన్ల పరిధిలోని 10 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. లావేరు, టెక్కలి, నందిగాం, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, పాతపట్నం, మెళియాపుట్టి, కొత్తూరు, హిరమండలం, LN పేట మండలాల్లోని 321 పంచాయతీల్లో తొలిదశ ఎన్నికలు జరగనున్నాయి. అయితే కోటబొమ్మాళి మండలంలోని పట్టుపురంలో సర్పంచ్ అభ్యర్ధికి రిజర్వేషన్ అడ్డంకిగా మారడంతో ఇక్కడ అసలు నామినేషన్లే దాఖలు కాలేదు.
320 పంచాయతీల్లో 39 పంచాయతీలు మాత్రమే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాల్లో పోటీ త్రీవంగా ఉంది. పైగా ప్రత్యర్ధి పార్టీ కంటే సొంత పార్టీ నుంచే రెబల్స్ బరిలోకి దిగడంతో వైసీపీలో కలవరం మొదలైంది. ఎచ్చెర్ల నియోజకర్గం లావేరు మండలంలోని 26 పంచాయతీల్లో రెండు మాత్రమే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 24లో ఎనిమిది పంచాయతీల్లో సొంతపార్టీ నుంచి బలంగా పోటీ ఉంది. ఇక్కడ రెబల్ అభ్యర్ధులకు నచ్చజెప్పలేక ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ చేతులెత్తేశారు.
టీడీపీకి కంచుకోటగా భావించే టెక్కలి నియోజకవర్గ పరిధిలో పంచాయతీలను ఎలాగైనా కైవసం చేసుకోవాలని వైఎస్‌ఆర్‌సీపీ తీవ్రంగా ప్రయత్నించింది. కానీ ఫలించలేదు. టెక్కలి నియోజకవర్గ పరిధిలోని 136 పంచాయతీల్లో 12పంచాయతీలు మాత్రమే ఏకగ్రీవమయ్యాయి. ఇక్కడే అసలు సమస్య వచ్చిపడింది వైసీపీ నేతలకు. టెక్కలి మండల పరిధిలోని 27 పంచాయతీల్లో లింగాలవలస, అయోధ్యాపురం ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 25లో పది పంచాయతీల్లో రెబల్స్ నుంచి గట్టిపోటీ ఉంది .
ఇక నందిగాం మండలంలో మొత్తం 37పంచాయతీల్లో 6 ఏకగ్రీవం కాగా.. 13పంచాయతీల్లో రెబల్స్ బరిలోకి దిగుతున్నారు. సంతబొమ్మాళి మండలంలోనూ ఇదే పరిస్థితి ఉంది. సంతబొమ్మాళి పరిధిలోని 34 పంచాయతీల్లో మూడు చోట్ల మాత్రమే ఏకగ్రీవాలు కాగా… ఎనిమిది స్థానాల్లో రెబల్స్ పోటీకి రెడీ అయ్యారు. కోటబొమ్మాళి మండలంలోని 38 పంచాయతీల్లో జర్జంగిలో మాత్రమే ఏకగ్రీవం చేసుకోగలిగారు. 16 పంచాయతీల్లో ఇద్దరేసి వైసీపీ అభ్యర్ధులు బరిలో నిలిచారు .
ఇలా ఒక్క టెక్కలి నియోజకవర్గ పరిధిలోనే 47 పంచాయతీల్లో వైసీపీ రెబల్స్ బరిలో దిగి సై అంటున్నారు. పాతపట్నంలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ మొత్తం 159 పంచాయతీలుంటే… 25 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 124 పంచాయతీల్లో దాదాపు 60కి పైగా పంచాయతీల్లో వైసీపీ రెబర్స్ వర్సెస్ వైసీపీనే నడుస్తోంది.