ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్‌కు చెందిన సెర్చ్ ఇంజిన్ లో అప్పుడప్పుడు పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా అందులో మరొక పొరపాటు చోటు చేసుకుంది. భారత క్రికెట్ జట్టు కోచ్ రవిశాస్త్రి వయస్సును గూగుల్ తప్పుగా చూపించింది. ఆయన 1900వ సంవత్సరం మే 27వ తేదీన జన్మించాడని, ఆయన వయస్సు 58కి బదులుగా 120 అని గూగుల్ చూపించింది.
అయితే తప్పును వెంటనే నిర్దారించిన గూగుల్ దాన్ని త్వరగా సరిదిద్దుకుంది. కానీ అప్పటికే ఆ మిస్టేక్‌కు చెందిన స్క్రీన్ షాట్‌ను తీశారు. అనంతరం దాన్ని యూజర్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ క్రమంలో ఆ పిక్ వైరల్‌గా మారింది. అందులో రవిశాస్త్రి వయస్సు 120 ఏళ్లుగా చూడవచ్చు.
కాగా శాస్త్రి 1962 మే 27న జన్మించగా భారత క్రికెట్ జట్టుకు 80 టెస్టులు, 150 వన్డేలు ఆడాడు. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలోని భారత జట్టు వరల్డ్ కప్ గెలవగా ఆ జట్టులో శాస్త్రి కూడా ఉన్నాడు. ప్రస్తుతం శాస్త్రి టీమిండియాకు 2017 నుంచి కోచ్‌గా పనిచేస్తున్నాడు. అయితే శాస్త్రితో ఉన్న సాన్నిహిత్యం వల్లే కోహ్లి ఆయనే కోచ్‌గా ఉండాలని పట్టుబట్టి మరీ ఆయనకు కోచ్ పదవి వచ్చేలా చేశాడని అప్పట్లో టాక్ వినిపించింది.