యెస్ బ్యాంక్ చైర్మ‌న్ కేసు.. చంద్ర‌బాబు మెడ‌కు బిగుసుకుంటున్న ఈడీ ఉచ్చు..?

-

దేశంలోని ప్ర‌ముఖ ప్రైవేటు బ్యాంకుల్లో ఒక‌టైన యెస్ బ్యాంకు తీవ్ర ఆర్థిక సంక్షోభంతో ఓ వైపు కొట్టుమిట్టాడుతుంటే.. ఆ బ్యాంకు వ్య‌వ‌స్థాప‌క‌ చైర్మ‌న్ రాణా క‌పూర్ చేసిన నిర్వాకం కూడా మ‌రో వైపు బ‌య‌ట‌కు వ‌చ్చింది. షెల్ కంపెనీల ద్వారా మ‌నీ లాండ‌రింగ్‌కు పాల్ప‌డ్డాడ‌ని, డిపాజిట్ల‌ను అక్ర‌మంగా త‌ర‌లించాడ‌ని, కార్పొరేట్ల‌కు లాభం చేకూర్చేలా వ్య‌హ‌రించాడ‌ని ఆరోపిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) ఆదివారం ఆయ‌న్ను అరెస్టు చేసింది. అయితే చంద్ర‌బాబు ఏపీ సీఎంగా ఉన్న‌ప్పుడు ఆయ‌న‌కు అప్ప‌ట్లో రాణా కపూర్‌తో ఉన్న స‌త్సంబంధాల దృష్ట్యా ఇప్పుడు ఈడీ చంద్ర‌బాబును ఈ కేసు ఉచ్చులోకి లాగనున్న‌ట్లు తెలిసింది.

చంద్ర‌బాబు నాయుడు ఏపీకి సీఎంగా ఉన్న స‌మ‌యంలో యెస్ బ్యాంకు చైర్మ‌న్ రాణా క‌పూర్ ప‌లు సార్లు ఏపీకి వ‌చ్చారు. ఈ క్ర‌మంలోనే యెస్ బ్యాంకుతో ఏపీ ప్ర‌భుత్వం అప్ప‌ట్లో ప‌లు ఒప్పందాలు చేసుకుంది. ఏపీలో టూరిజంను అభివృద్ధి చేసేందుకు అప్ప‌టి ప్ర‌భుత్వం యెస్ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు గాను 2015 సెప్టెంబ‌ర్‌లో చంద్ర‌బాబు సీఎం హోదాలో కొన్ని ల‌క్ష‌ల రూపాయ‌ల ఫీజును అప్ప‌ట్లో యెస్ బ్యాంకుకు చెల్లించారు. ఆ మేర‌కు అప్పుడు డాక్యుమెంట్ల‌ను కూడా సిద్ధం చేశారు. కానీ ఆ ప‌త్రాలు ఇప్పుడు ఏమ‌య్యాయో ఎవ‌రికీ తెలియ‌దు.

ఇక గ్లోబ‌ల్ ఇండియ‌న్ బ్యాంకింగ్ ప్రోగ్రామ్ కింద అప్ప‌ట్లో ఏపీ ప్ర‌భుత్వంతో యెస్ బ్యాంకు ఒప్పందం కూడా చేసుకుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు (ఏపీఎన్ఆర్‌టీ) సొసైటీ కింద స‌ద‌రు ప్రోగ్రామ్ ద్వారా తెలుగు ఎన్ఆర్ఐల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా యెస్ బ్యాంక్ సేవ‌ల‌ను అందించేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. అయితే ఆ త‌రువాత ఆ కార్య‌క్ర‌మం కొన‌సాగిందో, లేదో కూడా తెలియ‌దు. ఈ క్ర‌మంలోనే అప్ప‌ట్లో సీఎం చంద్ర‌బాబుతో స‌హా, టీడీపీ నాయ‌కులు కూడా యెస్ బ్యాంకు చైర్మ‌న్‌తో క‌లిసి అక్ర‌మ లావాదేవీలు ఏమైనా చేశారా, మ‌నీ లాండ‌రింగ్‌కు పాల్ప‌డ్డారా..? అన్న కోణంలో ఇప్పుడు ఈడీ విచార‌ణ చేస్తోంది. దీంతో మ‌రో కేసులో చంద్ర‌బాబు మెడ‌కు ఈడీ ఉచ్చు బిగిస్తుంద‌ని తెలుస్తోంది. అయితే దీనిపై స్ప‌ష్ట‌త రావాలంటే మ‌రికొద్ది రోజుల వ‌ర‌కు ఆగాల్సిందే..!

Read more RELATED
Recommended to you

Exit mobile version