అధిక బరువు తగ్గాలనుకునే వారు పాటిస్తున్న అనేక రకాల డైట్‌లలో కీటోడైట్ కూడా ఒకటి. ఇందులో పిండిపదార్థాలను తక్కువగా, కొవ్వులను ఎక్కువగా, ప్రోటీన్లను ఒక మోస్తరుగా తినాల్సి ఉంటుంది.
అధిక బరువు తగ్గాలనుకునే వారు పాటిస్తున్న అనేక రకాల డైట్‌లలో కీటోడైట్ కూడా ఒకటి. ఇందులో పిండిపదార్థాలను తక్కువగా, కొవ్వులను ఎక్కువగా, ప్రోటీన్లను ఒక మోస్తరుగా తినాల్సి ఉంటుంది. దీంతో మన శరీరం శక్తి కోసం గ్లూకోజ్‌పై కాకుండా కీటోన్లపై ఆధార పడుతుంది. మన శరీరంలో ఉన్న గ్లూకోజ్ మొత్తం ఖర్చయ్యాక అప్పుడు శరీరం కీటో స్థితిలోకి వెళ్తుంది. దీంతో ఆ సమయంలో శరీరంలో విడుదలయ్యే కీటోన్లనే మన శరీరం శక్తిగా ఉపయోగించుకుంటుంది. ఈ క్రమంలో మన శరీరంలో ఉండే కొవ్వు వేగంగా కరుగుతుంది. ఫలితంగా బరువు తగ్గుతారు. అలాగే ఇతర ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా మనకు కలుగుతాయి. అయితే కీటోడైట్‌ను పాటించాలనుకునేవారు కచ్చితంగా కింద తెలిపిన పలు విషయాలను తెలుసుకోవాలి. అవేమిటంటే…
1. మన శరీరం కీటో దశలోకి ప్రవేశించే సమయంలో మనకు ఫ్లూ లాంటి లక్షణాలు కనిపిస్తాయి. దీన్నే కీటో ఫ్లూ అంటారు.
2. కీటో డైట్‌లోకి పూర్తిగా వెళ్లాక మన శరీరంలో ఉన్న నీటి శాతం బాగా తగ్గుతుంది. అలాగే పొటాషియం, మెగ్నిషియం వంటి మినరల్స్‌ను మనం కోల్పోతాం. దీంతో బరువు తగ్గుతారు. అయితే అది కొవ్వు కరగడం వల్ల కాదు, శరీరంలో నీరు తగ్గడం వల్ల జరుగుతుంది. ఈ క్రమంలో మనకు డీహైడ్రేషన్ వస్తుంది. అలాగే తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. దాహం బాగా అవుతుంది. తలతిరగడం, మత్తుగా ఉండడం, తలనొప్పి, కండరాల నొప్పులు ఉంటాయి.
3. కీటో దశలో ఉన్నవారి శరీరంలో గ్లూకోజ్ తక్కువగా ఉంటుంది కనుక హైపోగ్లైసీమియా వస్తుంది. శరీరంలో చక్కెర శాతం తగ్గితే వచ్చే వ్యాధినే హైపోగ్లైసీమియా అంటారు. దీంతో తీవ్రమైన అలసట, ఆకలి, కంగారు, ఆతృత, ఆందోళన, విసుగు, వణకడం, చెమట పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
4. మన శరీరం కీటోదశలోకి ప్రవేశించినప్పుడు నోట్లో నుంచి పండ్లలాంటి వాసన వస్తుంది. అలాగే కొందరికి నెయిల్ పాలిష్ రిమూవర్ లాంటి వాసన వస్తుంది.
5. కీటోడైట్‌లో కొవ్వు ఎక్కువగా తీసుకుంటారు గనక మలబద్దకం వస్తుంది. అలాంటప్పుడు నీటిని ఎక్కువగా తాగాల్సి ఉంటుంది.
6. కీటోడైట్ పాటించే కొత్తలో చాలా మందికి నిద్రలేమి వస్తుంది. అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఎముకల్లో సాంద్రత తగ్గిపోయి ఎముకలు గుల్లబారిపోయేందుకు అవకాశం ఉంటుంది.
7. కీటో దశలో శరీరంలో ఎక్కువగా కీటోన్లు ఉంటాయి కనుక.. కిడ్నీ స్టోన్లు, మూత్రాశయ సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
8. మహిళలకు రుతు సమస్యలు వస్తాయి. పీరియడ్స్ ఆలస్యం అవడం, మిస్ అవడం జరుగుతుంది. కనుక ఈ సమస్యలను ఎదుర్కొంటామంటేనే ఎవరైనా కీటో డైట్ చేయడం ఉత్తమం. అది కూడా డాక్టర్ పర్యవేక్షణలో జరిగితే మంచిది.