ఆన్‌లైన్ రుణ యాప్ నిర్వాహకుల ఆగడాల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. యువత ప్రాణాలు బలి తీసుకుంటున్న లోన్ యాప్ ల పట్ల పోలీసులు, ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తున్నా ఇంకా వారి ఆగడాలు సాగుతూనే ఉన్నాయి. అమాయకులకు రుణాలు ఇచ్చి వాటిని గడువు కంటే ముందు చెల్లించాలని వేధింపులు షురూ చేస్తూ.. అయినా చెల్లించకపోతే కుటుంబ సభ్యులకు అసభ్యకర మెసేజ్ లు, ఫొటోలు, వీడియోలు పంపిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాజాగా లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
వనపర్తి జిల్లాలో దీపావళి పండుగ రోజున ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. కొత్తకోటకు చెందిన శేఖర్ ఓ రుణ యాప్ ద్వారా డబ్బు అప్పుగా తీసుకున్నాడు. డబ్బులు వాయిదాల పద్ధతిలో చెల్లించే క్రమంలో కొంత ఆలస్యం కావటం వల్ల.. రోజూ ఫోన్ చేసి వేధింపులకు గురి చేశారు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు, స్నేహితులకు న్యూడ్ వీడియోలు పంపి ఇబ్బందులకు గురిచేశారు. దీంతో అవమానకరంగా భావించిన గురై తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. వేధింపులను తట్టుకోలేక శేఖర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. పండగపూట తమ కుమారుడు మరణించడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.