ఏపీ సీఎం జగన్ ఎంత తొందరపడుతున్నారో.. అంతగా ఆయన ఆశలు వెనుకబడుతున్నాయని అంటున్నారు విశ్లేషకులు. రాష్ట్రంలో జిల్లాలను ఎంత వేగంగా అయితే.. అంతే వేగంగా విభజించి త్వరగా తాను పట్టు సాధించాలని జగన్ భావిస్తున్నారు. అయితే, ఈ ప్రక్రియ మాత్రం వెనక్కి వెళ్తూనే ఉంది. నిజానికి జగన్‌తోపాటు.. వైఎస్సార్ సీపీ నాయకులు కూడా అంతేతొందర పడుతున్నారు. జిల్లాలపై పట్టు పెంచుకునేందుకు అవకాశం ఉందని కొందరు భావిస్తే.. కొందరు ఇప్పటి వరకు ఉన్న ఆధిపత్య పోరు కొంతైనా తగ్గుతుందని అనుకుంటున్నారు. అయితే, ఈ విషయంలో మాత్రం జగన్ వ్యూహాలు మాత్రం వెనక్కి మళ్లుతున్నాయి.
ఇప్పటికే రెండు సార్లు ఈ విషయంలో కేంద్రం వాయిదా వేసింది. తాజాగా మరోసారి కూడా ఇదే తరహా సూచనలు జగన్‌కు ఇచ్చింది. జిల్లాల విభజనకు కేంద్రంతో అనుమతి అవసరం. అదే సమయంలో కేంద్రానికి చెప్పి చేయాలి. ఈ విషయం జగన్ కేంద్రానికి ఎప్పుడో విన్నవించారు. అయితే, ఇప్పట్లో జిల్లాల విభజన చేపట్టవద్దని.. జనాభా లెక్కలు తీసిన తర్వాతే ముందుకు వెళ్లాలని జగన్‌కు కేంద్రం సూచించింది. దీనికి జగన్ కూడా సరేననకతప్పలేదు. ఈ క్రమంలోనే ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో కమిటీని వేశారు.
ఆమె పని ప్రారంభించే సమయానికి ఇప్పుడు మరోసారి కేంద్రం నుంచి రెడ్ సిగ్నల్ వచ్చేసింది. కరోనా కారణంగా జనగణన తొలి దశ, జాతీయ పౌర పట్టిక మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇది అత్యవసరం కాదని కేంద్రం భావిస్తోంది. సో ఈ లెక్కన చూస్తే కొత్త జనగణన పూర్తయ్యే సరికి మరో యేడాదిన్నరకు పైగా సమయం పడుతుందని జాతీయ రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనికి తోడు ఈ లెక్కలను బేస్ చేసుకునే నియోజకవర్గాల పునర్విభజన కూడా జరగనుంది.
ఇక 2021 జనగణన ఎప్పటకి పూర్తవుతుందో ? అన్నదానిపై తుది నిర్ణయం తీసుకోలేదని జగన్‌కు కేంద్రం సంకేతాలు పంపింది. ఈ లెక్కలు పూర్తయ్యే వరకు జగన్ అనుకున్నట్టుగా జిల్లాల విభజన పూర్తి కాదు. జగన్ జిల్లాల విభజన కోసం ఎంత త్వరపడుతున్నా కేంద్రం నిర్ణయాలతో మాత్రం ఈ ప్రక్రియ ముందుకు సాగే పరిస్థితి లేదు. మరో విశేషం ఏంటంటే జగన్ జిల్లాల పునర్విభజన చేసే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలన్న ప్లాన్‌తో ఉన్నాడు. ఇక వచ్చే యేడాది కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం సందేహంగానే కనిపిస్తోంది. ఈ జనగణన వాయిదా జగన్‌కు పెద్ద ఎదురు దెబ్బే అనుకోవాలి.