కడప జిల్లా పులివెందుల….ఈ నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. పులివెందుల అంటే వైఎస్సార్ ఫ్యామిలీ అడ్డా అని అందరికీ తెలిసిందే. వైఎస్సార్ ఫ్యామిలీ మినహా, ఇక్కడ మరొక పార్టీకి గానీ, మరొక నాయకుడుగానీ విజయం దక్కడం అసాధ్యం. ఎప్పుడైతే వైఎస్సార్ రాజకీయాల్లోకి వచ్చారో అప్పటినుంచి పులివెందుల ఆ ఫ్యామిలీ కంచుకోట అయిపోయింది.
ఇక వైఎస్సార్ ఫ్యామిలీకి చెక్ పెట్టాలని తెలుగుదేశం పార్టీ అనేకసార్లు ప్రయత్నించి విఫలమైంది. వైఎస్సార్ ఉన్నంతవరకు ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఎప్పుడైతే ఆయన చనిపోవడం, జగన్ వైసీపీ పెట్టడం జరిగాయో అప్పటినుంచి పులివెందులలో వైసీపీ జెండా ఎగరడం మొదలైంది. 2012 ఉపఎన్నికలో వైసీపీ తరుపున విజయమ్మ గెలవగా, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా జగన్ విజయం సాధించారు.
అసలు 2019 ఎన్నికల్లో అయితే 175 నియోజకవర్గాల్లో జగన్‌దే అతి పెద్ద మెజారిటీ. జగన్ దాదాపు 90 వేల ఓట్ల మెజారిటీతో పులివెందులలో గెలిచారు. ఇక భవిష్యత్‌లో కూడా జగన్‌ని ఇక్కడ ఓడించడం సాధ్యమయ్యే పని కాదు. పైగా గత కొన్ని ఎన్నికల నుంచి వైఎస్సార్ ఫ్యామిలీకి ప్రత్యర్ధిగా నిలబడుతున్న సతీశ్ రెడ్డి సైతం రాజకీయాలకు దూరం జరిగిపోయారు. పులివెందులలో టిడిపికి కాస్త మనుగడ ఉందంటే దానికి కారణం సతీశ్ రెడ్డే. అయితే గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఓడిపోవడం, జగన్ అధికారంలోకి రావడంతో సతీశ్…టిడిపికి రాజీనామా చేసి రాజకీయాలకు దూరం జరిగారు.
దీంతో పులివెందుల టిడిపి ఇంచార్జ్‌గా బీటెక్ రవిని చంద్రబాబు పెట్టారు. రవికి జమ్మలమడుగు బాధ్యతలు కూడా ఇచ్చారు. కానీ తాజాగా జమ్మలమడుగు ఇంచార్జ్‌గా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సోదరుడు కుమారుడు భూపేష్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. దీంతో రవి పూర్తిగా పులివెందుల బాధ్యతలు చూసుకొనున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో రవినే జగన్‌పై పోటీ చేసే ప్రత్యర్ధి. సతీశ్ రెడ్డి మళ్ళీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే పరిస్తితి కనిపించడం లేదు. అంటే వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రత్యర్ధి మారనున్నారు. మరి చూడాలి బీటెక్ రవి, జగన్‌కు ఎంతవరకు పోటీ ఇస్తారో?