ఆకాశంలో సగం. భూమి మీద సగం.. జనాభాలో సగం అంటూ నేతలంతా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేందుకు మహిళలను బాగానే ఉపయోగించుకుంటారు. కానీ వారికి సమాన స్థానం ఇచ్చేందుకు మాత్రం ససేమిరా అంటారు. పార్లమెంట్‌లో మహిళా బిల్లును వ్యతిరేకించే నేతలంతా మీటింగ్‌ల్లో మాత్రం మేమే మహిళా లోకంను ఉద్దరించే వారిగా ఫోజులు కొడుతారు. కానీ వారి హక్కులను మాత్రం వారిని అనుభవించనివ్వరు.. అంతే కాదు.. వారికి రాజకీయంగా వచ్చిన రాజ్యంగపదవులను కూడా వారిని స్వతంత్రంగా చేయకుండా, వారి పదవుల్లోనూ మగవారే పెత్తనం చేస్తున్నారు.
అయితే ఇప్పుడు మహిళా లోకానికి ఏపీ సీఎం జగన్ ఓ తీపి కబురు అందించారు. మహిళల కోసం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గురువారం షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. వారికి మగవారితో సమానంగా హక్కులు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ గురువారం మార్కెటింగ్, సహకార శాఖల పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మార్కెట్ కమిటీలలో 50 శాతం చైర్మన్ పదవులు మహిళలకే కేటాయిస్తామని సీఎం జగన్ అన్నారు.
మార్కెట్లను సమర్థవంతంగా నిర్వహించాలంటే మహిళలకే సమాన భాగం చైర్మన్ పదవులు ఇస్తే రైతులకు న్యాయం జరుగుతుందని సీఎం జగన్ ఆలోచన చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. అంతే కాదు రైతుల సంక్షేమం కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నారు సీఎం జగన్. మార్కెటింగ్ వ్యవస్థలో దళారీ వ్యవస్థ పోవాలన్నారు. అక్టోబర్ చివరి నాటికి అన్ని మార్కెట్ కమిటీలను నియమిస్తామన్నారు. కనీస మద్దతు ధర లేని పంటలకు మద్దతు ధర ప్రకటిస్తామని ఆయన హామీనిచ్చారు. అక్టోబర్ చివరి నాటికి చిరు ధాన్యాల బోర్డును ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల నష్టాల పై కమిటి వేస్తామన్నారు.
ఈ బ్యాంకుల బలోపేతం కోసం ప్రతిష్టాత్మక సంస్థతో అధ్యయనం చేయిస్తామన్నారు. ఆరు నెలల్లో దళారీ వ్యవస్థ పూర్తిగా రూపుమాపాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. దళారీ అనే మాటే వినిపించకూడదన్నారు. రైతు పడ్డ కష్టానికి ఫలితం దక్కాలని, రైతులను మోసం చేస్తే ఊరుకునేది లేదని దళారులను ఆయన హెచ్చరించారు. ఇప్పుడు ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మహిళలకు పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు కేటాయించడం పై మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ఇకముందు మార్కెటింగ్ చైర్మన్ పదవులు రావడంతో మార్కెటింగ్ వ్యవస్థను గాడిలో పెట్టనున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.