కాస్త తెలివిగా వ్యవహరించిన జగన్ ..!

-

అంతర్వేది రథం దగ్దం సంఘటనపై రాష్ట్రప్రభుత్వం కాస్త తెలివిగానే వ్యవహిరించింది. అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని రథం నాలుగు రోజుల క్రితం అగ్నికి ఆహుతైన విషయం అందరికీ తెలిసిందే.  రథం అగ్నికి ఆహుతవ్వటంతో ఆ చుట్టు పక్కల ప్రాంతంలో జనాల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. దీన్ని బిజెపి, హిందుత్వ సంస్ధలు అడ్వాంటేజ్ తీసుకోవాలని ప్రయత్నించాయి. సరే ఎలాగూ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నించే టిడిపి, జనసేన ఉండనే ఉన్నాయి  కదా. అందుకనే అంతర్వేదిలో వెంటనే ఆందోళనలు మొదలైపోయాయి.

నిజానికి ఘటనకు ఎవరు బాధ్యులో ఇంతవరకు తెలియలేదు. అయినా రాజకీయ పార్టీలు మాత్రం తప్పంతా ప్రభుత్వానిదే అని బాధ్యులను ప్రభుత్వం కాపాడుతోందంటూ ఆరోపణలు మొదలుపెట్టేశారు. దాంతో  విషయం తీవ్రతను గుర్తించిన జగన్మోహన్ రెడ్డి వెంటనే పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమయ్యాడు. ఘటనపై విచారణకు సిబిఐని కోరాలని డిసైడ్ చేశాడు. వెంటనే డిజిపి గౌతమ్ సవాంగ్  ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్రహోం శాఖకు మెయిల్ ద్వారా పంపాడు. కాబట్టి ఒకటి రెండు రోజుల్లో కేంద్ర హోంశాఖ నుండి ఓ ప్రకటన రావచ్చని ఆశిస్తున్నారు.

నిజానికి  ఘటనపై దర్యాప్తును సిబిఐకి అప్పగించాలనే నిర్ణయం ఓ రెండు రోజుల ముందే తీసుకునుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే ఆలయాలను అడ్డం పెట్టుకుని రాజకీయ పార్టీలు జనాల్లో సెంటిమెంటును రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్న విషయం స్పష్టంగా అర్ధమవుతోంది. లేకపోతే ఘటన జరిగిన స్ధలానికి బిజెపి, విశ్వహిందుపరిషత్ నేతలు, కార్యకర్తలు జెండాలు, కర్రలు పట్టుకుని ర్యాలీగా రావాల్సిన అవసరమే లేదు.  రథం దగ్దం అయిన విషయం స్పష్టంగా తెలుస్తున్నా వీళ్ళు ఘటనా స్ధలానికి వచ్చి చేసేదేముంటుంది ?

అలాగే టిడిపి కూడా నిజనిర్ధారణ కమిటి అంటూ హడావుడి మొదలుపెట్టింది. చుట్టుపక్కల నేతలను, కార్యకర్తలను అంతర్వేదికి తరలించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయాలు మొదలుపెట్టేసిన విషయం ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది.  విజయవాడలో రాత్రికి రాత్రి 36 దేవాలయాలను కూల్చేసిన చంద్రబాబునాయుడు కూడా ఇపుడు రథం దగ్దం అంశంలో తీవ్రంగా స్పందిస్తుండటమే విచిత్రంగా ఉంది. అలాగే గతంలో తిరుమలలోని వెయ్యి కాళ్ళమండపాన్ని కూడా చంద్రబాబు అధికారంలో ఉన్నపుడే కూల్చేశారు. విజయవాడలో 36 దేవాలయాలను కూల్చేసినపుడు వీటికి ప్రత్యామ్నాయంగా కొత్తవి నిర్మిస్తామని చెప్పిన తర్వాత పట్టించుకోనే లేదు.

సరే రాజకీయాలన్నాక అధికారపార్టీని ప్రతిపక్షాలు ఇరుకున పెట్టేందుకే చూస్తాయనటంలో సందేహమే లేదు. ఇపుడు మొదలైంది కూడా అదే. అందుకనే విషయాన్ని గమనించిన జగన్ పరిస్దితి చేయిదాటిపోకముందే సిబిఐ విచారణ చేయించాలని నిర్ణయించటం మంచిదే. ఇప్పటికే జగన్ను హిందుమత వ్యతిరేకిగా సొంతపార్టీ నరసాపురం ఎంపి కనుమూరు రఘురామ కృష్ణంరాజు లాంటి వాళ్ళు ముద్ర వేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు అందరికీ తెలిసిందే. కాబట్టి సిబిఐ విచారణ చేపట్టి బాధ్యులను గుర్తించటం చాలా ముఖ్యం. ఒకవేళ పోలీసులే నిష్పక్షపాతంగా విచారణ చేసినా రాజకీయ పార్టీలు, జనాలు నమ్మేట్లు లేరు. అందుకనే జగన్ కాస్త తెలివిగా వ్యవహరించాడనే అనిపిస్తోంది.

-vuyyuru subhash 

Read more RELATED
Recommended to you

Exit mobile version