రైతు బంధు డబ్బు బ్యాంకుల వడ్డీ కట్టడానికే సరిపోతోంది : షర్మిల

-

ప్రజా ప్రస్థాన యాత్రలో భాగంగా శుక్రవారం మల్లాపూర్ మండల కేంద్రంలో వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల పాదయాత్ర చేశారు. ఈ
సందర్భంగా షర్మిల టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ నెరవేర్చలేదని షర్మిల మండిపడ్డారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి, పోడు పట్టాలు, సున్నా వడ్డీకి రుణాలు అని చెప్పి కేసీఆర్ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు షర్మిల. రైతు బంధు డబ్బు బ్యాంకుల నుంచి తెచ్చుకున్న రుణాలకు వడ్డీ కట్టడానికే సరిపోతోందని చెప్పారు. కేసీఆర్ పాలనలో ఎనిమిదేళ్లుగా ఎందరో రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు షర్మిల. లక్షల కొద్దీ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. ఉద్యోగాలు ఇవ్వడం మాత్రం కేసీఆర్ కు చేతకావడం లేదని విమర్శించారు. కళ్ల ముందే నిరుద్యోగులు బలై పోతున్నా ఒక్క నోటిఫికేషన్ కూడా వేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు షర్మిల.

ఎనిమిదేళ్లుగా ప్రాజెక్టుల పేరు చెప్పి లక్ష కోట్ల రూపాయలు కాజేసిన ఘనుడు కేసీఆర్ అని ఎద్దేవా చేశారు షర్మిల. ఎన్నికల సమయంలో మాత్రమే కేసీఆర్ బయటకి వస్తారని, ఎన్నికలు అయిపోగానే ఫాం హౌజ్ కు వెళ్లిపోతారని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఉన్నాలేనట్లేనన్న షర్మిల… ఆ రెండు పార్టీలు ఏనాడు కేసీఆర్ ఆగడాలు, అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడలేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్టీపీకి మద్దతుగా నిలవాలని కోరారు షర్మిల.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version