టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో వ్యవహారంలో గవర్నర్‌కు వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో ‘మీకు తెలిసే ఉంటుంది, TSPSC పేపర్ లీకు కుంభకోణం యావత్ రాష్ట్రాన్ని కుదుపివేసింది. నెలలు, యేండ్ల తరబడి కష్టపడి పరీక్షకు ప్రిపేర్ అయిన అభ్యర్థుల ఆశల మీద నీళ్లు చల్లి, వాళ్ళ భవిష్యత్తు ప్రశ్న్రార్ధకంగా మార్చింది. నెలన్నరకు ముందే ప్రెస్ మీట్ పెట్టిన TSPSC చైర్మన్ డా జనార్దన్ రెడ్డి ఇలా అన్నారు – అరెస్ట్ అయిన రాజశేఖర్ రెడ్డి అనే నెట్వర్కింగ్ నిపుణుడు ఐపీలను బయటనుండి యాక్సెస్ చేసాడని, ప్రవీణ్ అనే మరొక్క నిందితునితో కలిసి ఈ పని చేసాడని చెప్పారు. ఈ విధంగా ఐపీలు తెలుసుకుంటే ఎక్కడినుండైనా కమిషన్ సంబంధించిన డేటా పొందవచ్చు అని అయన వివరించారు. మరి తెలంగాణ సర్కారు సంస్థలన్నిటి IT అవసరాలను చూసుకునే IT డిపార్ట్మెంట్ లో కొందరి వ్యక్తులు ఖచ్చితంగా ఈ నేరంలో వీరికి సహకరించారు కదా, లేకపోతే ఇది సాధ్యం కాదని స్పష్టమైనది. మరి ఐటీ శాఖ మీద విచారణ ఎందుకు లేదు? ఆ శాఖ ఎవరి అధీనంలో ఉందని ప్రశ్నించే ధైర్యం చెయ్యట్లేదు? ఇది ఖచ్చితంగా IT శాఖ వైఫల్యమే. అందులో పనిచేస్తున్న కొందరి దురాశకు వేల విద్యార్థులు భవిత బలి అవుతోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి తనయుని నిర్వహణలో పనిచేసే శాఖలోని నేరస్తులను ఎవరో పట్టుకుని శిక్షించే ఆలోచనే లేదు. ఈ శాఖ జోలికి సిట్ వెళ్లనే వెళ్లట్లేదు.
పెద్దతలలు బయటపడతాయని భయం ఏమో. పోలీసులు ఈ దిశగా విచారణ చేయకపోతే అసలు కేసు క్లోసే కాదు. దీన్నిబట్టి చుస్తే ఇది స్పష్టంగా డేటా storage కి సంబంధించి వైఫల్యమే. ఇలా ఐతే అసలు డేటా యాక్సెస్ చేయడానికి authentication, ఖచ్చితంగా రెగ్యులర్ ఆడిట్స్, చెక్స్ ఇవన్నీ అసలు జరుగుతున్నాయా లేదో అనే అనుమానం ప్రజలకు ఉంది. మరిన్ని పేపర్ లీకులు సంగతి, IT విభాగం నిర్వహణలో ఉన్న ఇతర రాష్ట్ర ప్రభుత్వ శాఖల సమాచారం భద్రత, ఇవన్నీ ప్రజానీకాన్ని కలవరపెడుతున్నాయి.అందువలన గౌరవ గవర్నరుగారికి మా విజ్ఞప్తి ఏమిటంటే, మీరు మీ రాజ్యాంగ అధికారాల ద్వారా IT విభాగం, అందులోని కొందరి పాత్రపై, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆక్ట్, 2000 కింద విచారణ ఎంతదాకా వచ్చిందో SITను ప్రోగ్రెస్ రిపోర్ట్ అడగగలరు. ఇది చాలా కీలకమైన అంశం ఎందుకంటే, ఏ సర్కారు అయితే పేపర్ లీకు ఆరోపణలు ఎదుర్కుంటుందో, ఆ సర్కారే విచారణ చేపడుతోంది. ఇందులో చిన్నవారిని పట్టుకుని, పెద్దతలకాయలు తప్పించుకునే ప్రమాదం స్పష్టంగా కనపడుతోంది’ అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.