వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అమరావతి రైతులు ఈరోజు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. మంగళగిరిలో మీడియాతో ఆమె మాట్లాడుతూ, ఈరోజు పిన్నెళ్లి కారుపై దాడి జరిగిన తీరు చూస్తే గుండెలు అదిరిపోతాయని భయాందోళన వ్యక్తం చేశారు. కారు అద్దాలు పగిలిన తీరును చూస్తే… పిన్నెల్లిని చంపేయాలనే ఆలోచనతోనే దాడి చేసినట్టు అర్థమవుతుందని అన్నారు. ఎన్టీఆర్ మీద చెప్పులు, రాళ్లు వేసి ఆయన జీవితాన్ని సర్వనాశనం చేశారని.. పరిటాల హత్యను క్యాష్ చేసుకునేందుకు అల్లర్లు సృష్టించారని ఆరోపించారు.
అల్లర్లు, అరాచకాలు సృష్టించి రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని విరుచుకుపడ్డారు రోజా. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలను విడదీసే ప్రయత్నాన్ని చంద్రబాబు చేస్తున్నారని అన్నారు. ఇకపై వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలపై దాడి చేస్తే… ఉపేక్షించబోమని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులకు ప్రాణభయం కలిగించే విధంగా వ్యవహరిస్తే ఊరుకోబోమని చెప్పారు. రాజధాని తరలింపుపై ఇంతవరకు ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి జగన్ కానీ ఎలాంటి ప్రకటన చేయలేదని… కానీ, టీడీపీ ఎందుకు రాద్ధాంతం చేస్తోందని రోజా ప్రశ్నించారు. రాజధాని నివేదికలపై అసెంబ్లీలో చర్చ తర్వాతే తుది ప్రకటన ఉంటుందని అన్నారు.