వైసీపీలో ‘ఇదేం ఖర్మ’ అంటున్న ఎమ్మెల్యే..మంత్రికే షాక్.!

-

జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం పరిస్తితి అధోగతి పాలైందని, రాష్ట్రం సర్వం నాశనమైందని, పది రూపాయిలు ఇచ్చి వంద రూపాయిలు కొట్టేస్తున్నారని, ఇదేంటి అని ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని, దాడులు, అరాచకాలు, అక్రమాలు, అవినీతి పెరిగిపోయిందని, అసలు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటనలకు వెళుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు ఈ కార్యక్రమం చేస్తున్నారు. అంటే జగన్ వచ్చాక ఇదేం ఖర్మ అని జనం అనుకుంటున్నారనే విధంగా కాన్సెప్ట్ రూపొందించారు.

అయితే టీడీపీ వాళ్లే కాదు..వైసీపీలో కొందరు ఎమ్మెల్యేలు కూడా ఇదేం ఖర్మ అని అనుకుంటున్నారని, పనులు చేయడానికి  నిధులు ఇవ్వట్లేదని, ఎమ్మెల్యేలని డమ్మీలుగా చేసి వాలంటీర్లకు పెత్తనం ఇచ్చారని, అసలు ఇదేం ఖర్మ తమకు అని ఎమ్మెల్యేలు వాపోతున్నారని టీడీపీ శ్రేణులు ఎద్దేవా చేస్తున్నాయి. మరి ఏ ఎమ్మెల్యేలు అలా అనుకుంటున్నారో తెలియదు గాని..నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం అధికారుల వల్ల ఇదేం ఖర్మ అంటున్నారు.

తాజాగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సమక్షంలో ఇటీవల వరదల వల్ల నష్టపోయిన పంటలకు సంబంధించి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న కోటంరెడ్డి.. నెల్లూరు రూరల్ నియోజకవర్గం సౌత్ మోపూరులో మొగిలి పాలెం వద్ద సవిటి వాగు తెగిపోయి సుమారు 150 ఎకరాల పంట పొలాలు నీటమునిగాయని, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పంట పొలాలు మునిగిపోయాయని ఫైర్ అయ్యారు.

కొన్ని రోడ్లు సగం సగం వేశారని, కొన్ని రోడ్లు వేస్తే వర్షాలకే కొట్టుకుపోయాయని, అధికారులు ఇంత అవకతవకలకు ఎలా పాల్పడుతున్నారని, అధికారుల పనులు చూసి జనం ఇదేం ఖర్మ అనుకుంటున్నారని కోటంరెడ్డి విరుచుకుపడ్డారు. అయితే కోటంరెడ్డికి మంత్రి కూడా సర్ది చెప్పలేకపోయారు. అయితే గతంలో తమ ప్రభుత్వంలో జరిగే తప్పులని కోటంరెడ్డి బహిరంగంగానే ఎత్తిచూపిన సందర్భాలు ఉన్నాయి. మొత్తానికి టీడీపీ నినాదాన్ని కోటంరెడ్డి అలా వాడుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version