రైతులపై బిఆర్ఎస్ మొసలి కన్నీరు కారుస్తుందని మండిపడ్డారు కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. అన్నదాతలను మోసం చేస్తూనే ధర్నాల పేరుతో దొంగ డ్రామాలు చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు వడ్డీ రాయితీ, విత్తన రాయితీ ఇచ్చే వాళ్ళమని.. కానీ ఇప్పుడు ఏ రైతుకి సబ్సిడీ లేదన్నారు. పనిముట్లను సబ్సిడీపై ఇవ్వడం లేదని మండిపడ్డారు. కౌలు రైతులను ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు ప్రభాకర్.
రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కొత్త బిచ్చగాళ్లలా కొట్లాడుకుంటున్నాయని దుయ్యబట్టారు. కల్లాల కోసం రూ. 150 కోట్లు ఖర్చు పెట్టలేరా? అని నిలదీశారు. రైతులను కేవలం రాజకీయాలకే వాడుకుంటున్నారని.. రైతులపై నిజమైన ప్రేమ ఎవరికీ లేదన్నారు. కెసిఆర్ మాటలు ఎవరూ నమ్మద్దని విజ్ఞప్తి చేశారు పొన్నం ప్రభాకర్.