ప్రస్తుతం వైసీపీకి సంబంధించి నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి ప్లీనరీలు జరుగుతున్నాయి. ఒక్కొక్కరుగా తమ అసంతృప్తిని వేదికపై చెప్పడం ,వాటిని అధినాయకత్వం దృష్టికి తీసుకువెళ్లమని కోరడం వంటివి చేస్తున్నారు. ఆ విధంగా విశాఖ కేంద్రంగా పనిచేసే వాసుపల్లి గణేశ్ (విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసన సభ్యులు) నిన్నటి వేళ కీలక వ్యాఖ్యలు చేశారు.
వాస్తవానికి ఎప్పటి నుంచో అసంతృప్తితో ఉన్న గణేశ్ ఇప్పటికే నియోజకవర్గ ఇంఛార్జ్ పదవిని వద్దనుకున్నారు. సంబంధిత పదవికి రాజీనామా కూడా చేశారు. అదేవిధంగా త్వరలో ఆయన పార్టీ మారుతారు అన్న వార్తలూ ఉన్నాయి. మళ్లీ టీడీపీ గూటికి చేరిపోయేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు అని కూడా తెలుస్తోంది. ఈ తరుణాన నిన్నటి వేళ గురజాడ కళాక్షేత్రలో జరిగిన జిల్లా స్థాయి ప్లీనరీలో వాసుపల్లి గణేశ్ కీలక వ్యాఖ్యలు చేయడం అవే ఇప్పుడు వైసీపీలో తీవ్ర చర్చకు తావిస్తుండడం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు తార్కాణాలు.
లాగే గుర్రం తన్నదు.. తన్నే గుర్రం లాగదు..అని అంటూ కార్యకర్తలను, ముఖ్య నాయకత్వ ప్రతినిధులను డైలమాలో పడేశారు. కార్యకర్తల్లో లాగే గుర్రాలు జెండాలు వేసుకుని లాగుతూనే ఉంటాయి. తన్నే గుర్రాలు మాత్రం ఫైళ్లు పట్టుకుని నాయకుల చుట్టూ తిరుగుతూ పదవులు పొందుతూనే ఉంటాయి. ఆ విధంగా ఇక్కడ పదవులు దక్కించుకుంటూనే ఉన్నాయి.కనుక లాగే గుర్రం ఏది, తన్నే గుర్రం ఏది అన్నది పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్ హోదాలో వైవీ సుబ్బారెడ్డి గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆ తరహా బాధ్యత వైవీ సుబ్బారెడ్డిదే ! అని కూడా చెబుతూ ఆసక్తిదాయక వ్యాఖ్యలు చేశారు. దీనిపై వై వీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ …కార్యకర్తలలో అసంతృప్తి ఉందని, కొన్ని ఇబ్బందులున్నాయని, వీటిని ఏ విధంగా అధిగమించాలో రాష్ట్ర స్థాయి ప్లీనరీలో
అధ్యక్షుడు జగన్-తో చర్చిస్తానని అన్నారు.