టీడీపీ-జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుంటే అధికార వైసీపీకి రిస్క్ అనే సంగతి చెప్పాల్సిన పని లేదు. వాస్తవ పరిస్తితుల్లో చూస్తే పొత్తు అనేది ఎంతోకొంత వైసీపీకి నష్టం చేస్తుందనే చెప్పాలి. ఎందుకంటే గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ ఉన్న మాట వాస్తవమే..అదే సమయంలో జనసేన విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి టిడిపికి నష్టం..వైసీపీకి లాభం జరిగేలా చేసింది. దాదాపు 50 పైనే స్థానాల్లో జనసేన ఓట్లు చీలిక ప్రభావం ఉంది.
అంటే ఆ స్థానాల్లో టిడిపిపై వైసీపీకి వచ్చిన మెజారిటీ కంటే..జనసేనకు పడిన ఓట్లు ఎక్కువ. ఒకవేళ గత ఎన్నికల్లోనే టిడిపి-జనసేన పొత్తు పెట్టుకుని ఉంటే..వైసీపీ గెలిచేదేమో గాని..151 సీట్లు మాత్రం వచ్చేవి కాదు..టిడిపి-జనసేనకు కనీసం 60 పైనే సీట్లు వచ్చేవి అని చెప్పవచ్చు. అందుకే ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీని గద్దె దించడానికి చంద్రబాబు-పవన్ ఏకమవుతున్నారు. ఇక వారు కలవకుండా ఉండటానికి వైసీపీ నేతలు గట్టిగా కష్టపడుతున్నారు. టిడిపి-జనసేనలు పొత్తు పెట్టుకోకుండా…ఆ రెండు పార్టీల మధ్య ఏదో రకంగా చిచ్చు పెట్టడానికే వైసీపీ చూస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
రెండు పార్టీల కార్యకర్తల మధ్య గొడవ పెట్టడానికి..నందమూరి-మెగా అనే విభేదాలు తీసుకురావడం, కమ్మ-కాపు కులాల మధ్య చిచ్చు పెట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుందని అంటున్నారు. ఇదే క్రమంలో ఎప్పుడు పవన్‌ని తిట్టే మంత్రి రోజా..తాజాగా పవన్‌ని సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. లోకేశ్ పాదయాత్ర ఫెయిల్ అయిందని, అందుకని వారాహితో పవన్ యాత్ర చేస్తే ఎక్కడ సక్సెస్ అవుతారని, ఆయనపై సొంత మీడియాతో విషం చల్లుతున్నారని కామెంట్ చేశారు.
ఒకవేళ టిడిపి అలాంటి పనిచేసి ఉంటే పవన్ చూసుకుంటారు..కానీ రోజా ఇలా సపోర్ట్ చేయడం వెనుక కుట్ర ఉందనే అనుకుంటున్నారు. అంటే టిడిపితో పవన్ కలవకుండా ఉండటానికే వైసీపీ కష్టపడుతుందని చెబుతున్నారు. మరి వైసీపీ కష్టం ఫలిస్తుందో లేదో చూడాలి.