దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియాను సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు విరుచుకు పడుతున్నాయి. తాజాగా సిసోదియా అరెస్టుపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. సిసోదియా అరెస్టు సీబీఐ అధికారులకే నచ్చలేదని.. రాజకీయ ఒత్తిళ్లొకు తలొగ్గి మాత్రమే అరెస్టు చేశారని ట్వీట్ చేశారు.
‘సీబీఐ అధికారుల్లో చాలా మందికి మనీశ్ సిసోదియాను అరెస్టు చేయడం నచ్చలేదు. సీబీఐ అధికారులకు మనీశ్‌పై మంచి గౌరవం ఉంది. పైగా ఈ కేసులో అతనికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు కూడా లేవు. అయినా అతని అరెస్టుకు రాజకీయంగా తీవ్ర ఒత్తిళ్లు వచ్చాయి. రాజకీయ గురువుల ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు సిసోదియాను అరెస్ట్ చేయాల్సి వచ్చింది’ అని ట్విటర్‌లో కేజ్రీవాల్ పేర్కొన్నారు.
దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణలో భాగంగా ఆదివారం మనీశ్ సిసోడియాను తమ కార్యాలయానికి పిలిచిన సీబీఐ అధికారులు.. దాదాపు 8 గంటలపాటు ప్రశ్నించిన అనంతరం అరెస్ట్ చేశారు. సీబీఐ కార్యాలయానికి వెళ్లడానికి ముందు మనీశ్ సిసోదియా ఆప్ మద్దతుదారులతో భారీ రోడ్ షో నిర్వహించారు. ఆప్‌ను చూసి బీజేపీ భయపడుతోందని, అందుకే తనను తప్పుడు కేసులో ఇరికించిందని ఆ రోడ్ షోలో సిసోదియా వ్యాఖ్యానించారు.
I am told that most CBI officers were against Manish’s arrest. All of them have huge respect for him and there is no evidence against him. But the political pressure to arrest him was so high that they had to obey their political masters
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 27, 2023