భక్తుల ద్వారా కరోనా సోకలేనందున తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనాలను నిలుపుదల చేయబోమని టీటీడీ బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుపతి పరిసర ప్రాంతాల భక్తులు దర్శనానికి రావొద్దని, ఆన్‌లైన్ ద్వారా టిక్కెట్లు పొందిన భక్తులు మాత్రమే దర్శనానికి రావాలని సూచించారు. ఆన్‌లైన్ ద్వారా రోజూ 9వేల మంది భక్తులకు మాత్రమే అవకాశముందని ఆయన వెల్లడించారు.
వచ్చే భక్తులను అలిపిరి వద్ద పరీక్షించి కొండపైకి అనుమతి ఇస్తున్నామని, జ్వరం, తదితర అనుమానిత లక్షణాలు ఉంటే వారిని ఆస్పత్రికి తరలిస్తున్నామని సుబ్బారెడ్డి వివరించారు. అర్చకులు, ఉద్యోగులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని, భక్తుల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఛైర్మన్ తెలిపారు. కాగా, లాక్ డౌన్ సడలింపుల అనంతరం తెరుచుకున్న శ్రీవారి క్షేత్రంలో కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే.