చింతమనేని ‘ఖబడ్దార్’ ఇది నీ జాగిరి కాదు..పవన్

-

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేన పోరాట యాత్రలో భాగంగా దెందులూరులో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ ఎవడబ్బా సొత్తు కాదు.. గూండాయిజం చేస్తూ రాజకీయం చేస్తామంటే చూస్తూ ఊరుకోం.. కాళ్లు చేతులు విరగొడతాం అంటూ హెచ్చరించారు.  చింతమనేని ప్రభాకర్ లాంటి వ్యక్తిని ఏపీ ప్రభుత్వ విప్ గా పెట్టినందుకు ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు.  క్రమశిక్షణ తప్పిన ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోరని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నాడు తెదేపా కు మద్దతిచ్చినప్పుడు లా అండ్ ఆర్డర్ ని అదుపులో ఉంచాలని కోరానని గుర్తు చేశారు.

తాము పోరాటయాత్రకు వస్తుంటే సభ ఎలా పెడతారో చూస్తామని తమను బెదరించారని, ఇలాంటి ఆకు రౌడీలను, గాలి రౌడీలను పదహారేళ్ల వయసు నుంచే తాను చూస్తున్నానని అన్నారు. 27 కేసులున్న దెందులూరు ఎమ్మెల్యేను చట్టసభల్లో కూర్చోబెట్టారని, రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తున్న చంద్రబాబును ఎందుకు గెలిపించాలన్నారు. చింతమనేని విషయంలో ప్రభుత్వం ఏం చేస్తోంది? మీరు చర్యలు తీసుకుంటారా? మమ్మల్ని చర్య తీసుకోమంటారా? అని ప్రశ్నించిన పవన్, జనం కోసం జనసైనికులు ఉన్నారని, తానే కనుక రెచ్చగొట్టాలనుకుంటే అగ్నిగుండం సృష్టించగలనని అన్నారు. ‘కులాలు, మ‌తాల‌కు అతీతంగా పార్టీ పెట్టాను. జ‌న‌సేన యువ‌త‌రం పార్టీ. ఈ త‌రం పార్టీ. రేప‌టి త‌రాన్ని శాసించేది నేటి త‌ర‌మే. 19 ఏళ్ల‌కే సాయుధ పోరాటానికి సిద్ధ‌మ‌య్యా. మీ పిచ్చి చేష్టలు ఆపకపోతే విపరీతాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news