హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ కోవాగ్జిన్‌ను అభివృద్ధి చేసిన విషయం విదితమే. ఈ టీకాను ఇప్పటికే దేశవ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వ్యాక్సిన్‌కు చెందిన 3వ దశ క్లినికల్ ట్రయల్స్ డేటాను జూలైలో ప్రచురించనున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ 78 శాతం మేర ప్రభావవంతంగా పనిచేస్తుందని ఇప్పటికే నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది. అదే హాస్పిటల్ పాలు కాకుండా ఈ వ్యాక్సిన్ 100 శాతం రక్షణను అందిస్తుందని తేల్చారు.
ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న అత్యుత్తమ, సురక్షితమైన కోవిడ్ వ్యాక్సిన్‌లలో కోవాగ్జిన్ ఒకటని భారత్ బయోటెక్ వెల్లడించింది. వ్యాక్సిన్లను తీసుకోవడం వల్ల ప్రజలకు కోవిడ్ నుంచి రక్షణ లభిస్తుందని తెలిపింది. ఫేజ్ 3 ట్రయల్స్‌కు చెందిన డేటాను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో)కు సమర్పించాల్సి ఉంది. అందుకు 3 నెలల గడువు ఉందని, అయితే పూర్తి ట్రయల్స్ డేటాను మాత్రం జూలైలో ప్రచురిస్తామని, తరువాత వ్యాక్సిన్‌కు పూర్తి స్థాయిలో లైసెన్స్ తీసుకుంటామని తెలియజేసింది.
ఇక కోవాగ్జిన్‌కు ఫేజ్ 4 ట్రయల్స్ నిర్వహిస్తామని భారత్ బయోటెక్ తెలియజేసింది. దీంతో వ్యాక్సిన్ శక్తి సామర్థ్యాలు పూర్తిగా తెలుస్తాయని అభిప్రాయపడింది. కాగా కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రైవేటు హాస్పిటల్స్‌లలో టీకాల ధరలను నిర్ణయించింది. భారత్ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్ ఒక్క డోసు ధరను జీఎస్టీ, సర్వీస్ చార్జితో కలిపి రూ.1410గా నిర్ణయించారు. భారత్‌లో ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన వ్యాక్సిన్లలో ఇదే నంబర్ వన్ స్థానంలో ఉండడం విశేషం.